పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుతుంది
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలని ఆకాంక్ష
పల్ల వెంకన్న మొక్కలను ప్రేమించారు, వాటితోనే ఎదిగారు
నర్సరీల పెంపకాన్ని వ్యాపార దృష్టితోనే చూడకుండా దేశ ప్రయోజనాలను కాంక్షించారు
నిబద్ధతో, కష్టపడి పని చేసే మనస్తత్వం, చేసే వృత్తి పట్ల అనురక్తి అనేవి శ్రీ పల్ల వెంకన్న గారి విజయసూత్రాలు
హరితహారం పేరిట తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభినందనీయం
నర్సరీ రాజ్యానికి రారాజు – పల్ల వెంకన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందుకోసం ముఖ్యంగా యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించిన నర్సరీ రాజ్యానికి రారాజు – పల్ల వెంకన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్ల వెంకన్న కుటుంబ సభ్యులకు, ప్రచురణ కర్తలకు, పుస్తక రచయిత వల్లీశ్వర్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
పల్ల వెంకన్న శక్తి అసాధారణమైనదని, దాని వెనుక ఉన్నది ప్రకృతేనని భావిస్తానన్న ఉపరాష్ట్రపతి, వారు పుస్తకాల్ని చదవకపోయినా మొక్కలను చదివారని, వాటితో మమేకమై ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ఐదోతరగతి వరకే చదువుకున్నా, శరీరం పూర్తిగా సహకరించని పరిస్థితుల్లో ఉన్నా ప్రకృతి విజ్ఞానాన్ని ఔపోసన పట్టి, కార్యదీక్ష, అనుభవంతో వృక్ష శాస్త్రవేత్తలకు సైతం సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారని తెలిపారు.
వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విచ్చలవిడిగా చెట్టు కొట్టేయడం వల్ల భూతాపం విపరీతంగా పెరిగిపోతోందన్న ఉపరాష్ట్రపతి, పర్యావరణ అసమతౌల్యత ప్రకృతి విపత్తులకు కారణం అవుతోందని తెలిపారు. అభివృద్ధి చెందాలన్న ప్రయత్నంలో ప్రకృతిని ధ్వసం చేసుకుంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఈ మహాయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కష్టపడి, కష్టాన్ని ఇష్టపడి పని చేయడమే జీవితంలో ఎదిగే మార్గమన్న ఉపరాష్ట్రపతి పల్ల వెంకన్న తమ దివ్యాంగత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడ్డారని, ఆ నిబద్ధతే అర ఎకరా నర్సరీని 40 నుంచి 50 ఏళ్ళలో వందెకరాల స్థాయికి చేర్చిందని తెలిపారు. దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేసిన శ్రీ వెంకన్న, ప్రతి ఇంట్లో పచ్చదనాన్ని పెంచడం ద్వారా దేశమంతా పచ్చదనాన్ని పెంచవచ్చని ఆకాంక్షించారని తెలిపారు. వ్యాపారదృష్టితోనే కాక, దేశ ప్రయోజనాల దృష్టితోనూ పని చేసిన ఆయన దేశభక్తి ముందుతరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
పాఠశాలలు, దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఉచితంగా మొక్కలు అందజేయడం, ఆరోగ్యశిబిరాల నిర్వహణ, పేద విద్యార్థులకు పుస్తకాల వితరణ వంటి పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించిన ఉపరాష్ట్రపతి, ఓ ఆలయాన్ని సైతం నిర్మించి ఆధ్యాత్మిక స్ఫూర్తిని పంచడం ముదావహమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ ఉద్యమానికి అనుగుణంగా అదే స్ఫూర్తి గ్రీన్ భారత్ ఉద్యమానికి అంకితమైన శ్రీ పల్ల వెంకన్న నర్సరరీల విస్తరణను ప్రోత్సహించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నర్సరీ శిక్షణనిచ్చి పల్లె ప్రగతిని ఆకాంక్షించారన్నారు.
జీవితంలో ఓ స్థాయికి ఎదగడం పెద్ద విషయం కాదని, దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడమే కత్తిమీద సాము అన్న ఉపరాష్ట్రపతి, నాణ్యతలో రాజీ పడని తత్వమే శ్రీ పల్ల వెంకన్నను నిలబెట్టిందని తెలిపారు. ‘ట్రెండ్ సెట్టర్ ఆఫ్ నర్సరీ ఇన్ ఇండియా’ సహా అనేక జాతీయ, ప్రాంతీయ అవార్డులు, పురస్కారాలు వారి అంకిత భావానికి, సాధించిన విజయాలకు దర్పణం పడతాయన్న ఆయన, చేసేపని పట్ల నిబద్ధత, కష్టపడి పని చేసే మనస్తత్వం, చేసే వృత్తిపట్ల అనురక్తి… ఇలాంటివే వారిని ఉన్నత స్థాయికి చేర్చాయన్నారు.
ప్రకృతిని ప్రేమించిన పల్లా వెంకన్న స్ఫూర్తిని యువతకు చేరవేసేందుకు వారి కుటుంబ సభ్యులు నడుం బిగించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, పచ్చదనం – పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా హరితహారం పేరిట మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆయన, పాఠశాల స్థాయి నుంచి పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం పట్ల పిల్లలకు అవగాహన పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి.పట్టాభిరామ్, ఎమెస్కో బుక్స్ సి.ఈ.ఓ. శ్రీ విజయకుమార్, ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత వల్లీశ్వర్, పల్ల వెంకన్న కుటుంబ సభ్యులు సహా దేశవ్యాప్తంగా పలు నర్సరీల యజమానులు, నర్సరీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.