అమరావతి: పాలనతో ప్రజాస్వామ్య ప్రాధాన్యతను ఆనాడే రాముడు తెలిపారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించిందని చెప్పారు. పాలకుడు ఆదర్శనీయుడిగా ఉండాలని తన పాలనతో రుజువు చేసుకున్నారని చంద్రబాబు తెలియజేశారు. సిఎంతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుమూర్తి శ్రీరాముడు అని పవన్ అన్నారు. ఒక నాయకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో రాముడి నుంచి గ్రహించాలని, కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మార్మోగుతోందని వెల్లడించారు.
దుష్ట పాలనకు ప్రజలు ధర్మబద్ధంగా చరమగీతం పాడారని చెప్పారు. రాముడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నానని, రామరాజ్య పాలన ఆవిష్కృతం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ పేర్కొన్నారు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడని, పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని లోకేష్ తెలిపారు. ధర్మమార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు తోడుగా ఉంటాడని, శ్రీరామనవమి అందరికీ సుఖసంతోషాలు అందించాలని నారా లోకేష్ స్పష్టం చేశారు.