బిజెపి ‘తప్పుడు’ ప్రచారాన్ని ఎండగట్టాలి
పార్టీ కార్యకర్తలకు నవీన్ ఉద్బోధ
భువనేశ్వర్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం వరుసగా తొమ్మిదవ సారి బిజెడి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అధికార బిజెపి తప్పుడు కథనాలను బహిర్గతం చేయవలసిందిగా ఉద్బోధించారు. బిజెడి రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘శంఖ భవన్’లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ ఎన్నికైనట్లు సంస్థాగత ఎన్నిక రిటర్నింగ్ అధికారి పికె దేబ్ ప్రకటించారు. తన ఎన్నిక అనంతరం సమావేశంలో పట్నాయక్ మాట్లాడుతూ, ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీకి ఎక్కువ వోట్లు లభించినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి అంగీకరించాం.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడమే ఇందుకు కారణం. తప్పుడు కథనాలు సృష్టించడం బిజెడిపై ప్రధాన వ్యూహం. దీనిని ఎండగట్టేందుకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం దూకుడుగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు. ‘మన సోషల్ మీడియా ఉనికిని మెరుగుపరచుకోవలసిన అవసరం ఉంది. టెక్నాలజీని నిజాన్ని, వాస్తవ అంశాల వెల్లడికి ఉపయోగించాలి. టెక్నాలజీ లేకుండా మనం ప్రజలకు చేరువ కాజాలం’ అని పట్నాయక్ సూచించారు. పట్నాయక్ అధికార బిజెపి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘మన పార్టీ సంస్థాగత బలాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయరాదు. బిజెడి కార్యకర్తల స్ఫూర్తి ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. వారే మన సిసలైన ఆస్తులు’ అని అన్నారు. నవీన్ పట్నాయక్ ప్రాంతీయ పార్టీ బిజెడికి వ్యవస్థాపక అధ్యక్షుడు. పదవికి పోటీలో ఆయన ఏకైక అభ్యర్థి. ‘పట్నాయక్ ఏకగ్రీవంగా బిజెడి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు’ అని దేబ్ తెలియజేశారు.