Wednesday, January 22, 2025

3 రాష్ట్రాలు.. 3 పరాజయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పాలితులతో పాలకులు ఎంతగా మమేకమైతే అంతగా ఆదరణ ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్ర జలు అలాంటి పాలకులను గుండెల్లో చిరకాలం చిరస్మరణీయంగా ఉం చుకుంటారు. చరిత్ర పుటల్లో కూడా వారి పేరు చెక్కుచెదరకుండా ఉం టుంది. కాని పాలకులు, పాలితులకు దూరమైతే ఎలా ఉంటుందో, పా లకులకు పాలితులకు మధ్య అధికారులు సైంధవుల్లా రాజ్యాంగేతర శ క్తుల్లా మారి అధికారం చెలాయిస్తే ఎలా ఉంటుందో ఇటీవల మూడు ప్రభుత్వాల పతనాలు నిరూపించాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ రెడ్డి పతనం వెనుక అధికారులే కీలక పాత్ర వహించారని, వారు సిఎంఒ కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులుగా మారి మంత్రులు, ఎంఎల్‌ఎలకు, ప్రజలకు సిఎంను దూరం చేశారని దాని ఫలితమే జగన్ ఓటమి అంటూ ఆ పార్టీకి చెందిన మాజీ ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా సంచలనంగా వ్యాఖ్యానించారు.

సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఏమి జరుగుతుందో, ప్రజల నిజ సమస్యలేమిటో తెలియకుండా సిఎంఒలో ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి అడ్డుగోడలు సృష్టించారని రాజా సంచలనంగాబాంబు పేల్చారు. సిఎంఒలో అదనపు కార్యదర్శిగా పని చేసిన కె. ధనుంజయ రెడ్డి సిఎంకు, ప్రజలకు మధ్య పాతాళమంతా అగాథం సృష్టించారని, దీనితో జగన్ మోహన్ రెడ్డి అవమానకరమైన ఓటమిని చవిచూశారని దీనికి ఆ అధికారే కారణమని కూడా రాజా నిందించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి సమైక్య రాష్ట్రంలో నాటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో కీలక అధికారిగా ఎన్నో శాఖల్లో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఐఎఎస్‌గా ఎదిగి ఆ తర్వాత పాలకులకు విశ్వసనీయ అధికారిగా జగన్ పాలనలో సిఎంఒ అదనపు కార్యదర్శిగా పని చేసి చివరి సమయంలో విమర్శల పాలు కావలసివచ్చింది.

రాజా చేసిన వ్యాఖ్యలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఆ రాష్ట్రంతో పాటు ఒడిశాలో అధికారం కోల్పోయిన నవీన్ పట్నాయక్, ఐదు నెలల క్రితం సిఎం పదవిని చేజార్చుకున్న కెసిఆర్ సిఎంఒ కార్యాలయానికి కూడా వర్తిస్తాయని ఈ మూడు రాష్ట్రాల అధికార, అనధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు సిఎంఒ కార్యాలయాలు బ్యూరోక్రాట్ల పాలనకు నిలయంగా మారకూడదు. అవి ప్రజలకు, వారి తరపున ప్రతినిధులుగా ఉన్న మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలకు మధ్య వారధిలా ఉండాలి. ఈ అధికారులు సిఎంఒకు కళ్ళు, చెవులుగా ఉండడమే కాకుండా ప్రజలతో నిత్య సంబంధాలున్న ప్రజా ప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండాలి, వారికి సిఎంను కూడా అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రజాక్షేత్రంలోని అసలు సమస్యలు, పాలనలో మంచి చెడులు అధినేత దృష్టికి వస్తాయి.

తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. కాని ఈ అధికారులు సూపర్ పవర్లుగా మారి ప్రజా ప్రతినిధులకు కూడా అధినేతలను కలిసే అవకాశం కల్పించకపోవడంతో సిఎంలు అధికారం కోల్పోవలసి వస్తుందని రాజా వ్యాఖ్యలను సమర్థిస్తున్న ప్రజాప్రతినిధులు, కొందరు రిటైర్డు అధికారులు అంటున్నారు. ఒడిశాలో 24 ఏళ్ళుగా ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలన సాగించిన నవీన్ పట్నాయక్ పదవీచ్యుతుడు కావడానికి కూడా అక్కడ ప్రైవేటు సెక్రటరీగా పని చేసిన వికె పాండ్యన్ కారణమని రాజకీయ, అధికార వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నది. వికె పాండ్యన్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా సూపర్ సిఎంగా వ్యవహరించారని, పరిపాలనలో సిఎంకు, ఇతర ప్రజా ప్రతినిధులకు మధ్య గ్యాప్ పెంచారని అక్కడ ప్రస్తుతం విజయ దుందుభి మోగించిన బిజెపి వర్గాలు ఎన్నికల్లో దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్నాయని అంటున్నారు.

చివరకు నవీన్ పట్నాయక్ ఈ ఈ ఆరోపణలను ఖండించినా ప్రజలు విశ్వసించకుండా ఆయనను అధికారానికి దూరం చేశారు. తమిళనాడుకు చెందిన వికె పాండ్యన్ నవీన్ పట్నాయక్‌కు పదిహేనేళ్లుగా కుడిభుజంగా పని చేశారు. పాలనలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచారు. అయితే నవీన్ పట్నాయక్‌కు కుటుంబం లేకపోవడంతో పాండ్యన్ సిఎంఒకు ఆయనే అన్నీ తానై వ్యవహరించి దేశవ్యాప్తంగా వివాదాస్పద అధికారిగా నిలిచారు. భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ హయాంలో కూడా సిఎంఒలో కార్యదర్శిగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా ప్రస్తుతం రాజకీయ అధికార వర్గాల్లో దుమారం రేగుతున్నది. రాజశేఖర్ రెడ్డి కూడా కెసిఆర్‌ను ప్రజా ప్రతినిధులకు దూరం చేశారని, ఏనాడు వారు ప్రజా సమస్యలతో ప్రగతి భవన్‌కు వస్తే వారిని కెసిఆర్‌తో కలిసే అవకాశం కల్పించే వారు కాదని మాజీ ఎంఎల్‌ఎలు అంటున్నారు.

తమ అధినేతను కలిసే అవకాశం నిరాకరించడమే కాకుండా అపాయింట్‌మెంట్ పేరిట గంటల తరబడి నిరీక్షణకు గురి చేసేవాడని వారు చెబుతున్నారు. అధినేత భేటీకి ఈ అధికారే అడ్డుగా మారడంతో తమ సమస్యలే కాకుండా ప్రజా క్షేత్రంలోని నిజ సమస్యలు కూడా సిఎం దృష్టికి చేరేవి కాదని ఫలితంగా ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా అధికారం కోల్పోవలసి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు నీడలా ఉండేవారు. ఆయన కేంద్రంలో మంత్రిగా పని చేసినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ పేషీలో నిర్ణయాత్మక పాత్ర వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్‌కు చివరి దాకా వెన్నంటి ఉన్నారు. కాని ఇప్పుడు ఆయన వ్యవహార శైలిపై పలు రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మూడు ప్రభుత్వాల పతనానికి సిఎంఒ అధికారుల వివాదాస్పద పాత్రనే పూర్తిగా కారణం కాకున్నా అనేక కారణాల్లో ఇదే బలమైన కారణమని వారు ఎన్నో సంఘటనలు ఉదహరిస్తూ చెబుతున్నారు. ఈ అనుభవాల ఫలితమో మరేమిటో గాని నాలుగో సారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడు గురువారం ఎంపిల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు కేంద్రమైన సిఎంఒలో బ్యూరోక్రాట్ల పాలన ఉండదని తానే అన్నీ ఇకపై చూస్తానని, వింటానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాననే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News