Sunday, July 7, 2024

నవీన్ పట్నాయక్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఒడిశాలో తన 24 సంవత్సరాల పాలనకు ముగింపు పలుకుతూ బిజూ జనతా దళ్ (బిజెడి) చీఫ్ నవీన్ పట్నాయక్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో బిజెడి ఓడిపోయిన విషయం విదితమే. నవీన్ పట్నాయక్ తన రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్‌లో గవర్నర్ రఘువర్ దాస్‌కు అందజేసినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. బిజెడి నాయకులు అనేక మంది పట్నాయక్ నివాసం వద్ద సమీకృతమైనప్పటికీ రాజీనామా పత్రం సమర్పణకు ఆయన ఒక్కరే గవర్నర్ నివాసానికి వెళ్లారు.

బిజెడి చీఫ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం నిరీక్షిస్తున్న జర్నలిస్టుల వైపు చేతులు ఊపి, రాజ్ భవన్ నుంచి నిష్క్రమించారు. బిజెపి 147 అసెంబ్లీ సీట్లలోకి 78 సీట్లు సాధించడం ద్వారా ఒడిశాలో అధికారానికి దూసుకుపోయింది. బిజెడి 51 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌కు 14 సీట్లు లభించాయి. సిపిఐ (ఎం)కు ఒక సీటు రాగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. నవీన్ పట్నాయక్ తొలిసారి 2000 మార్చి 5న ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News