Monday, December 23, 2024

23 సంవత్సరాలు 138రోజులు సిఎంగా నవీన్ పట్నాయక్

- Advertisement -
- Advertisement -

దేశంలో రెండో సుదీర్ఘ సిఎంగా రికార్డు
జ్యోతిబసును దాటేసి ముందుకు
త్వరలోనే లాంగ్‌లివ్ నెంబరు 1 సిఎం

భువనేశ్వర్ : దేశంలో సందడిసందడి రాజకీయాలకు దూరంగా ఉంటూ సడీసప్పుడు లేకుండా పాలన సాగించే నవీన్ పట్నాయక్ రికార్డు సాధించారు. దేశలో అతి ఎక్కువకాలం సిఎంగా ఉంటూ వస్తున్న రెండో ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకూ ఈ ఖ్యాతి పశ్చిమ బెంగాల్ దిగ్గజ దివంగత నేత జ్యోతిబసుకు ఉండేది. ఇప్పుడు ఈ స్థానంలోకి పట్నాయక్ వచ్చి చేరారు. ఒడిషాకు ఐదుసార్లు సిఎంగా ఉంటూ వస్తున్న నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న ముఖ్యమంత్రి అయ్యారు.

Also Read: కాంగ్రెస్ ఫోన్ బ్యాంకింగ్ స్కామ్.. మోడీ ధ్వజం

ఈ క్రమంలో ఆయన సిఎం పదవిలో ఉన్న కాలం ఇప్పుడు 23 సంవత్సరాల 138 రోజులు దాటింది. ఇక దేశంలో అతి ఎక్కువకాలం సిఎం పదవిలో ఉన్న రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ ఛామ్లింగ్‌కే దక్కింది. ఆయన 1994లో ముఖ్యమంత్రి అయ్యి, 2019 వరకూ పదవిలో ఉండటం ద్వారా 24 ఏండ్ల పైబడి ఈ పీఠంలో ఉన్న ఖ్యాతి దక్కించుకున్నారు. ఛామ్లింగ్ రికార్డును కూడా దాటివేసేందుకు నవీన్ పట్నాయక్‌కు ఇప్పటికీ అవకాశం ఉంది. ఇక బెంగాల్‌లో తిరుగులేని విధంగా ఎర్రపార్టీల ఆధిపత్యాన్ని నిలిపిన జ్యోతిబసు 1977 నుంచి 2000 సంవత్సరంలో ఆయన మరణం వరకూ సిఎంగా ఉండి తన ఖాతాలో సిఎంగా 23 ఏండ్ల 137 రోజుల స్కోర్ వేసుకున్నారు. ఒడిషా సిఎం పట్నాయక్ మరో ప్రఖ్యాతి కూడా పొందారు.

ఛామ్లింగ్, బసు మాదిరిగా వరుసగా ఐదుసార్లు సిఎం అయిన ఘనత దక్కించుకున్నారు. ఇక వచ్చే ఏడాది జరిగే ఒడిషా అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ బిజెడి గెలిస్తే ఇక ఆయనే దేశంలో ఎక్కువకాలం పాలనలో ఉన్న సిఎం ఖ్యాతిని దక్కించుకుంటారు. ఇందుకు అవకాశాలు దండిగా ఉన్నాయి. తమ నేత నవీన్ పట్నాయక్ బెంగాల్ జ్యోతిబసు రికార్డును దాటేయడం తమకు ఆనందం కల్గించిందని బిజెడి ఉపాధ్యక్షులు ప్రసన్న ఆచార్య స్పందించారు. గత రికార్డులన్ని దాటేసి ఆయన సుదీర్ఘ సిఎంగా నిలుస్తారని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బిజెపి నేతలు పలువురు ఈ దశలో పట్నాయక్‌కు అభినందనలు తెలిపారు. అయితే ఆయన ఎక్కువకాలపు సిఎంగా ఉండి సాధించిదేమిటని కూడా ఈ నేతలు పెదవివిరిచారు. ఎక్కువకాలం పదవిలో ఉండటం కాదు, అతి తక్కువ దశలోనే చరిత్ర సృష్టించే వారినే చరిత్ర పదిలం చేసుకుంటుందని బిజెపి సీనియర్ నేత సురేష్ పూజారి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News