బెంగళూరు : ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహం ఈనెల 21 న స్వస్థలానికి చేరుకోనుంది. ఈమేరకు కర్ణాటక ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన చేసింది. మృతదేహాన్ని తరలించేందుకు కావాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్టు వెల్లడించింది. ఖర్ఖివ్ నగరంలో మార్చి 1 ఉదయం జరిగిన ఫిరంగి దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్ శేకరప్ప గ్యాసగౌడర్ (22) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ (నాలుగో సంవత్సరం) చదువుతున్న ఆయన స్వస్థలం హవేరీ జిల్లా లోని చెలగేరి. నవీన్ మృతదేహాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకునేందుకు విదేశాంగశాఖ అక్కడొక ప్రత్యేక ఏజెంట్‌ను నియమించిందని కర్ణాటక ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అక్కడున్న భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెంట్‌తో కలిసి మృతదేహాన్ని పోలాండ్ రాజధాని వార్సాకు తరలించారు. అక్కడున్న భారత రాయబాల కార్యాలయం , ప్రత్యేక ఏజెంట్‌తో కలసి మృతదేహాన్ని భారత్‌కు తరలించాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అక్కడ నుంచి మార్చి 21న ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ ఈకే 0568 లో బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నవీన్ మృతదేహం చేరుకోనుంది.