పాటియాలా : కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా కేంద్ర కారాగారంలో గుమస్తాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను ఏ విధంగా వివరించాలి? జైలు రికార్డులను ఏ విధంగా తయారు చేయాలి? అనే అంశాలపై ఆయనకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు.
గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి 90 రోజులకు సిద్ధూకు వేతనం చెల్లించరు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయనకు రోజుకు రూ. 40 నుంచి రూ. 90 వరకు వేతనం చెల్లిస్తారు. ఆయన నైపుణ్యం ఆధారంగా ఈ వేతనాన్ని నిర్ణయిస్తారు. ఆయన సంపాదనను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆయన హై ప్రొఫైల్ ఖైదీ కాబట్టి బ్యారక్స్‌లోనే గుమస్తాగా పని చేస్తారు. జైలు ఫైళ్ళను ఆయన ఉండే బ్యారక్స్‌కు పంపిస్తారు. ఆయనను తన సెల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు. సిద్ధూ మంగళవారం నుంచి గుమస్తాగా పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఆయన పని చేస్తారు. ఆయన ఉంటున్న బ్యారక్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
1988లో రోడ్డుపై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరచి, ఆ వ్యక్తి మరణానికి కారణమైనందుకు సిద్ధూకు సుప్రీంకోర్టు ఓ ఏడాది కఠిన కారాగారవాస శిక్ష విధించింది. ఈ తీర్పు ఈ నెల 19న వచ్చింది. ఈ నెల 20న ఆయన పాటియాలా ట్రయల్ కోర్టు సమక్షంలో లొంగిపోయారు.