కాంగ్రెస్ నేత సిద్ధూ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను రబ్బరు బొమ్మగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వమే పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు. మాన్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి రాష్ట్రంలో దిగజారిపోయిందని, నెలరోజుల్లో 40 మంది హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. గురువారం పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలుసుకున్న సిద్ధూ రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని వివరించారు. పంజాబ్ ముఖ్యమంత్రికి ఆత్మాభిమానం ఉండాలని, ఎవరో ఆడిస్తే ఆడకూడదని సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఎవరో ఆడిస్తున్న ఆటకు మరెవరో ఆడుతూ పాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూర్చుని ఆడిస్తున్న ఆ ముసుగువీరుడి ముసుగు తొలగిపోతోందని పరోక్షంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సిద్ధూ వ్యాఖ్యానించారు.