కర్తార్‌పూర్‌లో నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఆకాంక్ష
లాహోర్ : భారత్-పాక్‌ల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ జరగాలని, ఈ విధంగా ఇరుదేశాల మధ్య నూతన స్నేహ అధ్యాయం నెలకొనాలని నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లోని ప్రఖ్యాత గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను శనివారం పంజాబ్ పిసిసి నేత సందర్శించారు. అక్కడ సిక్కుల సాంప్రదాయక పద్ధతిలో ప్రార్థనలు నిర్వహించారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. సిక్కు యాత్రికులకు వీసా రహిత కర్తార్‌పూర్ పర్యటనకు భారతదేశం ఇటీవలే అధికారికంగా వీలు కల్పించింది. బాబా గురునానక్ దయవల్ల ఇరుదేశాల మధ్య సరికొత్త అధ్యాయం నెలకొంటుందని ఆశిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ప్రపంచ యుద్ధాలలో లక్షలాది మంది బలి అయ్యారు. పలు యూరప్ దేశాలలో ఆ తరువాతి క్రమంలో ఒకే వీసా, ఒకే పాస్‌పోర్టుతో సరిహద్దులు తెరుచుకున్నాయి. రాకపోకలు ఆరంభం అయ్యాయి. మరి ఇక్కడి ఈ రెండు దేశాలలో సమానంగా గౌరవం ఆదరణ పొందే భగత్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్ వంటి వారెందరో ఉన్నప్పుడు పాత బంధం హృదయాలలోనే చెక్కుచెదరకుండా నిలిచినప్పుడు ఇరు దేశాల మధ్య మునుపటి పర్యాటక, వాణిజ్య బంధాలు ఎందుకు తిరిగి నెలకొనకూడదని ప్రశ్నించారు.