పంజాబ్ కాంగ్రెస్ సారథ్యం అప్పగింత?
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతఃకలహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు, సిద్ధూకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వెలువడుతున్న వేళ వీరిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీష్ రావత్ కూడా సిద్ధూతో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సిద్ధూకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ వార్తలను రావత్ ఖండించారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి విజయం సాధించడానికి కెప్టెన్ సింగ్, సిద్ధూ ఇద్దరూ కలసికట్టుగా పనిచేసేందుకు ఒక శాంతి సూత్రాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం రూపొందిస్తున్నట్లు రావత్ తెలిపారు.