మద్దతుగా మంత్రి పదవికి రజియా సుల్తానా గుడ్‌బై
రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనంటూ సోనియాకు లేఖ
పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టీకరణ
మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తే కారణం కావచ్చంటూ ఊహాగానాలు
ఢిల్లీలో అమరీందర్ సింగ్
చండీగఢ్: మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగను న్న పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోవరసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు.ఈ లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన రెండున్నర నెలల్లోనే సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. పంజాబ్ మంత్రివర్గ విస్తరణ తర్వాత సిద్ధూ ఈ నిర్ణయం తీసుకోవడంతో మంత్రివర్గ విస్తరణపై అసమ్మతితోనే పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు వినవస్తున్నాయి.
కాగా సిద్ధూకు పిసిసి చీఫ్ పదవి కట్టబెట్టడాన్ని మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీ వల ఆయన సిద్ధూపై తీవ్ర ఆరోపణలు కూడా చేయడం తెలిసిందే. దేశానికి, పంజాబ్‌కు సిద్ధూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా సిద్ధూ, అమరీందర్‌ల మధ్య తీవ్ర విభేదాలు తలె త్తడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో, రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ్సద్ధూను పిసిసి చీఫ్‌గా నియమించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆతర్వాత సిఎంగా కెప్టెన్‌ను మార్చడం, ఆయన స్థానంలో సిద్ధూ సన్నిహితుడిగా ఉన్న దళిత నేత చరణ్‌జిత్ చన్నాను కొత్త సిఎంగా నియమించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అమరీందర్ సింగ్ ఢిల్లీ వెళ్లిన రోజునే సిద్ధూ రాజీనామా చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీలో అమరీందర్ బిజెపి అగ్రనేతలను కలుసుకోవచ్చని కూడా తెలు స్తోంది. అయితే ఆయన మాత్రం తాను ఎప్పుడు ఢిల్లీ వచ్చినా బస చేసే కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేయడం కోసమే వచ్చినట్లు చెప్పడం గమనార్హం. పముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగిన తర్వాత అమరీందర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూకు మద్దతుగా మలెర్ కోట్లా ఎంఎల్‌ఎ రజియా సుల్తానా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రజియాకు కేబినెట్ మంత్రి పదవి లభించింది.