కళంకితులకు అందలాల?
మౌనం వీడిన సిద్ధూ
చండీగఢ్ : నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, ఇందుకు ఎటువంటి త్యాగాలకు అయినా సిద్ధం అని నవ్‌జోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఇక్కడ చెప్పారు. ఉన్నట్లుండి పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన 24 గంటల తరువాత సిద్ధూ మౌనం వీడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తాను కలత చెందానని సిద్ధూ చెప్పారు. డిజిపి, అడ్వకేట్ జనరల్, కళంకిత నేతలకు నియామకాలపై తనకు పలు అనుమానాలు ఉన్నాయని, అటువంటి వారిని కీలక పదవులకు ఎంపిక చేస్తారా అని ట్విట్టర్ ద్వారా నిలదీశారు. తాను ఎప్పుడూ సత్యం కోసం నినదిస్తానని, ఇప్పుడు చేసింది కూడా ఇదేనని అన్నారు. పంజాబీల జీవన ప్రమాణాలలో మెరుగుదల, కీలకమైన మార్పు రావాలని తాను ఇంతకాలం నుంచి కదలుతున్నానని తెలిపారు. తన 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ అంశం అయినా రాజీలు లేకుండానే సాగిందని చెప్పారు. ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్నానని చెప్పారు. ప్రజల కోసం పాటుపడే దిశలోనే తాను రాజకీయాలలో నిర్ణయాలకు దిగానని, ఇదే తన ధర్మం, విద్యుక్త ధర్మంగా ఉంటూ వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ తనకు ఎవరి మీద రాజకీయ కక్షలేదని, తాను ఎప్పుడు సొంత స్వార్థపూరిత రాజకీయాలకు , పోరుకు దిగలేదన్నారు. తన రాజీనామా తరువాత ఏర్పడ్డ రాజకీయ పరిస్థితి నేపథ్యంలో సిద్ధూ నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పొందుపర్చారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా రాజకీయాలను సొంత అజెండాకు వాడుకోలేదని కేవలం అంశాలవారిగానే ముందుకు కదలినట్లు చెప్పారు. తనది ఎప్పుడూ పంజాబీ అజెండా అని దీనికి మద్దతుగానే నిలిచానని , రాజీ పడకుండా కదులుతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నతస్థాయిలో జరిగిన నియామకాలు విలువలతో రాజీపడినట్లుగా ఉన్నాయని, దీనిని తాను సహించడం లేదన్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్‌సహోటా రాష్ట్ర డిజిపిగా అదనపు బాధ్యతలు కట్టబెట్టడంపై సిద్ధూ పలు సందేహాలు వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బాదల్‌ల ప్రభుత్వాల హయాంలో క్లీన్‌చిట్స్ పొందిన అధికారులు నేతలకు ఇప్పుడు కీలక పదవులు కట్టబెట్టారని, చివరికి న్యాయపంపిణీ బాధ్యతలు కూడా అప్పగించారని విమర్శించారు. పలు కేసుల విచారణలు పెండింగ్‌లో ఉన్న పంజాబ్ మాజీ డిజిపి సుమేధు సింగ్ సైనీ తరఫున వాదించిన వ్యక్తిని ఇప్పుడు అడ్వకేట్ జనరల్ చేశారని, కీలక ఘటనలలో మచ్చపడ్డ వ్యక్తులను అకాళీదళ్ ప్రభుత్వ హయాంలో వదిలిపెట్టిన వారికి డిజిపి బాధ్యతలు ఇచ్చారని ఇదేం న్యాయం అని సిద్ధూ ప్రశ్నించారు. అన్యాయం జరుగుతున్నదనే అయోమయ పరిస్థితి ఉన్నప్పుడు కేవలం సత్యం వెంబడే కదలాలనే తమ తండ్రి చెప్పిన మాటలకు అనుగుణంగా తాను ఇప్పుడే కాదు ఎప్పుడూ స్పందిస్తానని తెలిపారు. తాను గురుసాహిబ్‌కు న్యాయం కోసం, పంజాబీల అభ్యున్నతికి పాటుపడుతున్నానని ఇదే పంథాలో ఇప్పుడూ స్పందిస్తున్నానని ట్వీటు వెలువరించారు.
పార్టీనే సుప్రీం ..సిద్ధూతో మాట్లాడా : చన్నీ
పిసిసి పదవి నుంచి వైదొలిగిన తరువాత సిద్ధూతో పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఫోన్‌లో బుధవారం మాట్లాడారు. సమస్యలుంటే మాట్లాడుకుందామని తెలిపారు. సర్దుకుపోవడం మంచిదని, పార్టీనే సుప్రీం అనే విషయాన్ని గమనించాలని, ప్రభుత్వం పార్టీ సూత్రాలను సిద్ధాంతాలను పాటిస్తుందని చన్నీ స్పష్టం చేశారు. తాను సిద్ధూతో మాట్లాడిన విషయాన్ని చన్నీ విలేకరులకు తెలిపారు. బుధవారం మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో విలేకరులు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితిపై ప్రశ్నించారు. సిద్ధూతో తాను కూర్చుని మాట్లాడుకుందామని చెప్పానని, పిసిసి అధ్యక్షులు అంటేనే రాష్ట్రానికి సంబంధించి పార్టీకి తలవంటివారని, తలమానికం వంటి వ్యక్తి కుటుంబ అంతర్గత అంశాలను తేల్చుకునేందుకు లోపలే కూర్చుని మాట్లాడుకోవడం ఉత్తమమన్నారు.
ఇదే విషయాన్ని తాను సిద్ధూకు చెప్పానని తెలిపారు. ఉన్నత స్థాయిల్లో నియామకాలను అనుచితం అని సిద్ధూ పేర్కొనడాన్ని విలేకరులు ప్రస్తావించగా అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని తాను భావిస్తున్నట్లు, పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ తరువాతనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే అవసరం అయితే నిర్ణయాలను సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు తన మాటే చెల్లాలనే పట్టుదల లేదని, దేనిపై అయినా ఏకపక్ష అభ్యంతరాలకు దిగేది లేదన్నారు. చర్చించుకుందామని తాను సిద్ధూతో చెప్పానని, కలిసేందుకు తానే సమయం చెపుతానని అన్నారని వివరించారు. ఇద్దరమూ కూర్చుని మాట్లాడుకుంటామన్నారు. సిద్ధూకు నచ్చచెప్పేందుకు మంత్రి పర్గత్ సింగ్ , కొందరు ఇతర నేతలు వెళ్లారని సిఎం తెలిపారు.