చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని కలవడానికి వెళ్లేముందు కాంగ్రెస్ నాయకుడు నవ్‌జ్యోత్ సింగ్‌ద్ధూ మరోసారి రాష్ట్ర కొత్త డిజిపి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాపై విరుచుకు పడ్డారు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అవమానపరచిన కేసులో సహోటా ఇద్దరు సిక్కు యువకులును అన్యాయంగా ఇరికించారని, మాజీ ముఖ్యమంత్రి బాదల్ కుటుంబానికి క్లీన్‌చిట్ ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చన్నీని కలవడం కోసం సిద్ధే పాటియాలనుంచి చండీగఢ్‌కు చేరుకున్న సమయంలోనే ఈ మేరకు ఓ ట్వీట్ వెలుగు చూడడం గమనార్హం. పంజాబ్‌లోని ఫరీద్ కోట్ జిల్లాలో2015లో గురుగంథ్ సాహిబ్‌కు అవమానం జరిగింది.
బాదల్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృదం( సిట్)కు సహోటా నాయకత్వం వహించారు. ఈ బృందం ఈ కేసులో ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడికి క్లీన్‌చిట్ ఇవ్వడమే కాకుండా ఇద్దరు సిక్కు యువకులను అన్యాయంగా ఇరికించిందని కూడా సిద్ధూ ఆరోపించారు. అంతేకాదు, 2018లో తాను ప్రస్తుత రాష్ట్ర హోమ్‌మంత్రి సుఖ్‌జిందర్ రణధావా, అప్పటి పంజాబ్ పిసిసి అధ్యక్షుడు సునీల్ జాఖర్‌లతో పాటుగా ‘బాధితులు’ను కలిసి న్యాయం కోసం వారు జరిపే పోరాటానికి మద్దతు ఇచ్చామని కూడా సిద్ధూ ఆ ట్వీట్‌లో గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి డిజిపి పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.