న్యూఢిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాలను ఈ నెల 31నుంచి దశలవారీగా తెరవాలని నవోదయ విద్యాలయ సమితి నిర్ణయించింది. తొలుత 9నుంచి 12వ తరగతి వరకు ఆమోదించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జవహర్ నవోదయ విద్యాలయాలను 50 శాతం సామర్థంతో తెరుచుకోవచ్చని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చని, అలాగే హాస్టళ్లలో ఉండవచ్చని, అయితే తల్లిదండ్రుల అనుమతితోనే ఇది జరగాలని పేర్కొంది. ఆన్‌లైన్ విద్య కూడా కొనసాగుతుంది. సరయిన కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థి శారీరక, మానసిక ఆరోగ్యానికి మద్దతు అందించడం కోసం ఈ ఏర్పాటు చేశారు. యుపి, ఢిల్లీ, హర్యానా సహా చాలా రాష్ట్రాలు కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1నుంచి ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభించడానికి విద్యార్థులతో పాటుగా, స్కూలు యాజమాన్యాలు పాటించాల్సిన మార్గదర్శకాలు, కొవిడ్ నిబంధనలను కూడా చాలా రాష్ట్రాలు ఇప్పటికే జారీ చేశాయి.