స్వాధీనం చేసుకున్న నావీ
స్థానికుడిదిగా గుర్తించిన పోలీసులు
కోచి: గుర్తు తెలియని డ్రోన్ ఒకటి కోచి తీరం సమీపంలోని వంతెనపై విహరించడం గమనించిన స్థానిక నావీ సిబ్బంది దానిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పజెప్పారు. జులై 26న తొప్పుంపడి వంతెనపై డ్రోన్ విహరించిన ఘటన జరిగింది. వదుథాల ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల స్థానికుడు దీనిని కొనుగోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ కోసం వినియోగిస్తున్నట్టుగా గుర్తించామని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, భారత నావీ నుంచి డ్రోన్‌ను వినియోగించేందుకు అతనికి ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రక్షణశాఖ లేదా ప్రైవేట్‌కు చెందిన విమానాశ్రయాలు, సైనిక స్థావరాలకు 3 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు లేదా రిమోట్ విహంగ పరికరాలను వినియోగించేందుకు వీల్లేదు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఒఎల్‌ఎక్స్ వెబ్‌సైట్ ద్వారా లక్ష రూపాయాలకు డ్రోన్‌ను కొనుగోలు చేసినట్టు నిందితుడు తెలిపారని, అయితే అందుకు ఆధారాలు చూపలేదని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.