Wednesday, April 23, 2025

ఆమె నుదుటిన పెళ్లి బొట్టు ఇప్పటికీ ఆరలేదు

- Advertisement -
- Advertisement -

ఫహల్గామ్ ఉగ్రదాడిలో వికలమైన ఓ జీవిత శకలమిది. హిమాంషి నర్వాలి . ఆమె నుదుటిన పెళ్లి బొట్టు ఇప్పటికీ ఆరలేదు. పారాణి గుర్తులు ఇంకా ఉన్నాయి. ఈ నెల 16వ తేదీనే ఆమె భారత నౌకాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంట భూతల స్వర్గం అనబడే కశ్మీర్‌ఖు అందమైన కలలతో వెళ్లారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన వినయ్‌కు 26 సంవత్సరాలే. చూడముచ్చటైన జంట చెట్టాపట్టాలేసుకుని ఫహల్గామ్ ప్రాంతానికి వచ్చారు.పెళ్లి అయిన వారం రోజులకు ఆమె భర్త వినయ్ భౌతిక కాయం ఇమిడి ఉన్న శవపేటిక ఆనుకుని , తలవాల్చి రోదిస్తూ ఉండాల్సి వచ్చింది. జీవితాంతపు ఎడబాటును తల్చుకుని కుమిలిపోయింది.హానిమూన్‌కు వచ్చిన రోజున వారు అక్కడికి సమీపంలోని బైసారన్‌కు వెళ్లారు. అక్కడి సుందర ప్రకృతి దృశ్యాలను ఇద్దరూ జంటగా తిలకిస్తూ గడిపారు.

ఇప్పటికీ ఆ జ్ఞాపకం ఆమెలో కదలాడుతూనే ఉంది. అక్కడ వారు భేల్‌పూరి సగం సగం తింటూ ఆనందక్షణాలను అనుభవించారు. ఇదే కదా జీవితం అనుకున్నారు. ఈ లోగానే ఉగ్రవాదుల మూక అక్కడికి పిడుగుపాటులా వచ్చి పడింది. కొందరిని ఎంచుకుని వారు సాగించిన ఉన్మాద దాడిలో, జరిపిన కాల్పుల్లో లెఫ్టినెంట్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. బుల్లెట్ దాదాపుగా ఆమెను తాకుతూ వెళ్లింది. కన్నుమూసి తెరిచేలోగా ఆయన విలవిల కొట్టుకుంటూ పడిపోవడం, ఆయన నెత్తురు చిట్లి ఆమె ముఖంపై పడటం జరిగింది. తాము ఆనంద క్షణాల్లో ఉండగా ముష్కరుడు వచ్చి , దాడికి దిగాడని ఆమె వాపోయింది. బుధవారం లెఫ్టినెంట్ వినయ్ భౌతిక కాయాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు. ఘటనాస్థలిలో ఓ వ్యక్తి ఈ లెఫ్టినెంట్‌ను టెర్రరిస్టుల దాడి నుంచి తప్పించడానికి యత్నించాడు. కానీ ఈ వ్యక్తిని మూక తోసేసి తమ రాక్షసపర్వం సాగించింది. భర్త ఖనన పేటిక వెంబడి భార్య నిలిచి ఉంది. ఆయనకు ఆత్మ శాంతి కలుగాలని వేడుకుంటున్నాను.

ఆయన అందరికి గర్వకారణం అయ్యేలా చేస్తానని , తన కుటుంబం ఆయనను పదికాలాలు గుర్తు పెట్టుకుంటుందని ఆమె కన్నీళ్ల మధ్య చెప్పారు. ఖనన వాటికను కౌగిలించుకుని తన జీవిత భాగస్వామికి తుది వీడ్కోలు చెప్పడానికి సిద్ధం అయ్యారు. ఆయన వీర సైనికుడు. ఆయన త్యాగం, ధైర్యం వల్లనే ఈ ప్రపంచం , ఈ భారత సముద్ర తీరం భయాలు లేకుండా ఉంటుంది. ఆయనకు తాను ఈ విధంగా శాల్యూట్ చెప్పాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. అన్ని విధాలుగా , అన్ని విధాలుగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తామని అన్నారు. శవపేటికకు తలబాదుకున్నట్లుగా ఆమె తారసిల్లారు. తోటి అధికారికి నౌకా సిబ్బంది గౌరవ నివాళులు అర్పించారు. ఖననపేటికపై టోపి ఉంచారు. కుటుంబ సభ్యులు ఆమెను ఓదారుస్తూ ఉండగా , వారిని ఆమె సముదాయిస్తూ సాగగా ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకున్న కన్నీటి బిందువుగా మారింది. ఎట్టకేలకు ఆమె పూర్తి స్థాయిలో ధైర్యం కొనితెచ్చుకుంది. నిటారుగా నిలబడి లేచి , జై హింద్ అంటూ వీరుడికి సలాం చేసింది. భర్తకు తుది వీడ్కోలు పలికింది.ఈ ప్రాంతం అంతా జై హింద్ నినాదాలతో మార్మోగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News