కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : నక్సల్స్ బాధిత ప్రాంతాల్లో భద్రతాదళాల మోహరింపు పెంపుదల, అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను సమర్ధంగా పర్యవేక్షించడం, వామపక్ష ఉగ్రవాద కేడర్ల నుంచి చాలా మంది వైదొలగి ప్రధాన జనస్రవంతిలో చేరడం తదితర పరిణామాల కారణంగా నక్సల్స్ సాగించే హింస, మారణ కాండ గత ఆరేళ్లలో బాగా తగ్గిందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2020 21 వార్షిక నివేదిక వెల్లడించింది. 2013 తో పోల్చుకుంటే 2020 లో నక్సల్స్ హింస 41 శాతం, హత్యాకాండ 54 శాతం తగ్గిందని, నక్సల్స్ హింసలో 88 శాతం 30 జిల్లాలకే పరిమితమైందని పేర్కొంది. 2013 లో 10 రాష్ట్రాల్లోని 76 జిల్లాల్లో 328 పోలీస్ స్టేషన్ల పరిధిలో నక్సల్స్‌హింస వ్యాపించగా, 2020 లో 9 రాష్ట్రాల్లో 53 జిల్లాల్లో 226 పోలీస్ స్టేషన్ల పరిధిలో హింస పరిమితమైందని వివరించింది. ఈ తగ్గుదల పరిణామం 2011 లో ప్రారంభమై 2020 వరకు కొనసాగిందని, గత ఆరేళ్లలో వామపక్ష ఉగ్రవాద హింస, భౌగోళిక ఉగ్రవాద వ్యాప్తి చాలావరకు చెప్పుకోతగినంతగా తగ్గిందని నివేదిక వివరించింది.
2013 తో పోల్చిచూస్తే హింసాత్మక సంఘటనలు మొత్తం మీద 41 శాతం (1136 నుంచి 665 ) , వామపక్ష ఉగ్రవాద సంబంధిత మరణాలు 54 శాతం (397 నుంచి 183) వరకు తగ్గాయని వివరించింది. 2019 తో పోల్చి చూసినా 2020 లో కూడా అదే పరిమిత స్థాయిలో హింసాత్మక సంఘటనలు(670 నుంచి 665 ), వామపక్ష ఉగ్రవాద సంబంధిత మరణాలు ( 202 నుంచి 183 ) 9 శాతం వరకు తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. భద్రతా దళాల మరణాలు కూడా 17 శాతం ( 52 నుంచి 43 ) వరకు తగ్గాయని వివరించింది.
2020 లో చత్తీస్‌గఢ్‌లో 315 హింసాత్మక సంఘటనలు, 111 మరణాలు సంభవించి పరమ అధ్వాన్న ప్రభావిత రాష్ట్రంగా నిలిచిందని, తరువాతి స్థానాల్లో ఝార్ఖండ్ (199 సంఘటనలు, 39 మరణాలు),ఒడిశా (50 సంఘటనలు, 9 మరణాలు), మహారాష్ట్ర (30 సంఘటనలు, 8 మరణాలు), బీహార్ (26 సంఘటనలు, 8 మరణాలు) ఉన్నాయని హోం మంత్రిత్వశాఖ ఉదహరించింది. దేశం మొత్తమ్మీద వివిధ వామపక్ష ఉగ్రవాద రూపాల ప్రేరేపిత హింసాత్మక సంఘటనల్లో 86 శాతం, సంబంధిత మరణాల్లో 96 శాతం వరకు జరుగుతుండడానికి అత్యంత శక్తివంతమైన సిపిఎం కారణమని నివేదిక ఆరోపించింది. ప్రతికూలతలు పెరుగుతున్నప్పటికీ , ఎలాంటి విజయాలు సాధించలేనప్పటికీ రాష్ట్రాల సరిహద్దుల్లో కొత్త ప్రాంతాల్లో తమ నక్సల్ కార్యకలాపాలను విస్తరింపచేయడానికి సిపిఎం ప్రయత్నిస్తోందని పేర్కొంది.