Sunday, April 13, 2025

సిక్కోలు విప్లవోద్యమ ధ్రువతార

- Advertisement -
- Advertisement -

ఎర్రెర్రని విప్లవాగ్నులు ఎచటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమన్నారు. శ్రీకాకుళ పోరాటం భారత దేశ విముక్తికి దారితీస్తోందన్న చైనా అధికారిక మాధ్యమం పెకింగ్ రేడియో ప్రకటనే ఆ ఉద్యమ తీవ్రతకు తార్కాణం. ఉద్దానం అనే ఉద్యమాల వనంలో ఉదయించిందొక తారక. ఆ వేగుచుక్క పేరే పైలా వాసుదేవరావు. ప్రపంచాన్ని కుదిపేసిన నక్సల్బరీ నిప్పురవ్వలు రగులుతోన్న సమయంలోనే యావత్ భారతదేశాన్ని సిక్కోలు వైపు కదంతొక్కేలా చేసింది శ్రీకాకుళ సాయుధ రైతాంగపోరాటం. పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రహి, తామాడ గణపతి, చినబాబు, గొరకల రాంబాబు లాంటి విప్లవవీరులను కన్నగడ్డ శ్రీకాకుళం జిల్లా పైలా వాసుదేవరావుకి జన్మనిచ్చింది. కాశీబుగ్గకు మూడు కిలోమీటర్ల దూరంలోని రిట్టపాడు పల్లెలో పైలా వాసుదేవరావు ఆగస్టు 11, 1932న జన్మించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాలపట్ల ఆకర్షితులైన పైలా 1953లో తన 21వ ఏట కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఉద్యమ అవసరాల రీత్యా సర్వేయర్ ఉద్యోగంలోనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి మారారు. ఆనాటికే బొడ్డపాడు కేంద్రంగా కామ్రేడ్ పంచాది కృష్ణమూర్తి, తామాడ గణపతి తదితర నాయకులు ఉద్దాన ప్రాంతంలో విప్లవకార్యక్రమాల్ని ప్రారంభించారు. బొడ్డపాడు పక్కగ్రామమైన మాకన్నపల్లికి పైలాగారు ఉపాధ్యాయుడిగా వచ్చారు. చుక్కనీరులేక జనం అల్లాడిపోతోన్న సమయంలో ప్రమాదకరమైన పాడుబడ్డ బావిలోకి ప్రాణాలకు తెగించి దిగి, పూడిక తీసి మాకన్నపల్లి యువతరాన్ని తట్టిలేపారు పైలా మాష్టారు. మట్టిపాకలో ఉన్న పాఠశాలను గ్రామప్రజల సహకారంతో పక్కా బిల్డింగ్‌లోకి మార్చారు. అక్కడే పగలు పాఠాలు నేర్పారు. రాత్రుళ్ళు విద్యార్థులను, యువకులను, రైతులను కూడగట్టి విప్లవపాఠాలు నేర్పారు.

ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తికి కూడా రాజీనామా చేసి ఉద్యమంలో మమేకమయ్యారు.1968 నవంబర్ 25 శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగపోరాటం ప్రారంభించబడ్డది. గిరిజన రైతాంగ పోరాటం ప్రారంభంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన కామ్రేడ్ పైలా 42 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా కదనరంగంలో దూకి సాయుధ పోరాట రాజకీయాల్ని ఎత్తిపట్టారు. పైలా నేతృత్వంలో నడిచిన తెగింపు దళాల్లో సభ్యురాలిగా మొదలై సాయుధ దళాల్లో ఆరితేరిన ఉక్కుమహిళ చంద్రమ్మను 1970లో వివాహమాడారు పైలాగారు. దళాలకు నష్టం వాటిల్లుతుందని భావించి కన్నబిడ్డను సైతం అమరుడు అత్తలూరి మల్లికార్జునరావు కుటుంబానికి ఇచ్చేసి పేగు బంధం కన్నా విప్లవోద్యమమే గొప్పదని రుజువు చేశారు. సాయుధ పోరాటంలో అడుగుపెట్టింది మొదలు తుదిశ్వాస వీడేంతవరకు పైలా జీవితమంతా త్యాగాల దొంతరలపైనే సాగింది.

12 ఏళ్ళపాటు సహచరి చంద్రక్క జైలు జీవితాన్ని అనుభవించినా ఒక్క క్షణమైనా విప్లవోద్యమం నుంచి మరల్చని నిఖార్సయిన కమ్యూనిస్టు ఆయన. వందల దాడుల్లో తృటిలో తప్పుకున్నారు. సమయస్ఫూర్తి గల నాయకుడు 1970 ప్రాంతానికి శ్రీకాకుళ ఉద్యమం తీవ్రమైన అణచివేతకు గురైంది. తీవ్రమైన నష్టాలు చవిచూసింది. పార్టీ అగ్రనాయకులైన వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, తామాడ గణపతి సుబ్బారావు, పంచాది కృష్ణమూర్తి, నిర్మల అంకమ్మ, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ భాస్కరరావు వంటి ముఖ్య నాయకులు అమరులయ్యారు. రాజాం గ్రామానికి చెంది పొందాల బాలకృష్ణ, నిరంజన్ సాహూ వంటి ఇంజినీర్లు లాయర్లు, డాక్టర్లు అమరులయ్యారు. కనిపిస్తే కాల్చివేతలకు కొనసాగుతున్న కాలమది.

పచ్చపచ్చని శ్రీకాకుళం అడవుల్లో వెచ్చనినెత్తురు ప్రవాహమై పారుతున్న కాలమది. అత్యంత నిర్బంధకాలంలో కామ్రేడ్ పైలా వాసుదేవరావు గుండె దిటవు చేసుకొని 1971 నాటికి మిగిలి ఉన్న కామ్రేడ్స్ అందర్నీ కూడదీశారు. ఇటు పార్వతీపురం, అటు ఉద్దానం ప్రాంతంలో కామ్రేడ్స్ అందరినీ మళ్ళీ కూడగట్టారు. మేరంగిలో ఇద్దరు కొరియర్ల సహకారంతో పార్వతీపురం ప్రాంతంలో గొర్ల కాపరి వేషధారణలో గోచిపోతా గట్టుకొని భుజాన కావిడి పెట్టుకుని చేత కర్ర పట్టుకొని గ్రామాలు తిరిగారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ వేషధారణతో తిరిగి అక్కడ దళాలను కాంటాక్ట్ అయ్యారు. కామ్రేడ్ ఆరిక సోములను, రాజారాం రెడ్డిని కలుసుకొని శ్రీకాకుళం రీజనల్ కమిటీని పునర్నిర్మాణం చేశారు. కెజి సత్యమూర్తితో కలిసిచారు. చారుమజుందార్‌తో విభేదించి బయటకు వచ్చి 73లో కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డిలతో ఆయన చర్చలు కొనసాగించారు.

1975లో కామ్రేడ్ సీపీతో కలిశారు. కామ్రేడ్ నీలం రామచంద్రయ్య అమరులైన తర్వాత 76లో సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ పైలా ఎన్నికయ్యారు. 89 వరకు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఆయన త్యాగానికి, ఆదర్శాలకు, నిబద్ధతకు నిలువెత్తు దర్పణం కామ్రేడ్ పైలా రాజకీయ జీవితం తెరిసిన పుస్తకం. మచ్చలేని మహానాయకుడు పైలా మాష్టారు. విప్లవద్యమమే ఊపిరిగా శ్వాసించి జీవితాంతం ప్రజల కోసమే పరితపించి తనను తాను మండించుకున్న అజ్ఞాత విప్లవ సూర్యుడు. కళ్ళెదుటే సహచరులు తూటాలకు బలవుతున్నా.. అమరులెత్తిన జెండాను సమున్నతంగా నిలబెట్టి తన భుజస్కంధాల పైన మూసుకుపోయాడు పైలా. తాను ఎత్తిన ఎర్రజెండాను అమరుడయ్యేంతవరకు దించలేదు.

పార్వతీపురం కుట్ర కేసులో అరెస్టు కాకుండా గెలిచిన ఏకైక వ్యక్తి ఆయన. శ్రీకాకుళ ఉద్యమం అది నల్లేరుమీద నడకకాదు. 15 సంవత్సరాలు నిలకడగా నిర్మించుకున్న ప్రజాఉద్యమం. వీరోచత విప్లవ పోరాటంలో ఎందరో సామాన్యులు అసమాన్యులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ పోరాటంలో భారత సమాజంపైన, తెలుగు నేలపైన గొప్ప ప్రభావం వేసింది. శ్రీకాకుళ ఉద్యమం మొదట తరం నిర్మాతల్లో కామ్రేడ్ పైల వాసుదేవరావు ఒకరు. నిజాయితీ, నిబద్ధతతో, ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకుండా ఆరు దశాబ్దాల పాటు అవిరామంగా ప్రజలకోసం పనిచేసిన కామ్రేడ్ పైలా జీవితం భవిష్యత్ తరాల విప్లవకారులకు ఆదర్శనీయం.

– వంకల మాధవరావు ( సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు)

( నేడు కామ్రేడ్ పైలా వాసు 15 వ వర్ధంతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News