నక్సలైట్ ఉద్యమం పూర్తిగా హింసను వది లిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనా ల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రభుత్వం తిరుగుబాటుదారుల ప్రాథమిక సమస్యల ను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లి. భూసంస్కరణలు, గ్రామీణ అభివృద్ధి, సామాజిక, -ఆర్థిక, న్యాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. తిరుగుబాటుదారులకు సామాజిక జీవితంలో తిరిగి చేర్చేందుకు పునరావాస ప్రణాళికలు రూపొందించాలి. సాయుధ పోరాటం ద్వారానే మార్పును తేవగలదనే లక్ష్యంగా ఉండవచ్చు. కానీ, చారిత్రకంగా చూస్తే ప్రజాస్వామ్య మార్గమే స్థిరమైన పరిష్కారం. హింసను వదిలిపెట్టి ప్రజా స్వామ్య వ్యవస్థలో సమస్యలను పరిష్కరిం చుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధిని, శాంతిని సాధించవచ్చు.
సమాజ మార్పును సాయుధ పోరాటం ద్వారా సాధించాలని ప్రయత్నించడం ఒక సిద్ధాంతానికి ఆచరణ రూపం కావచ్చు. కానీ చారిత్రక క్రమంలో దీర్ఘకాలిక సంఘర్షణలు భారీ ప్రాణ నష్టం చేకూరుస్తాయి. సామాజిక అస్థిరతలకు దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు, రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు స్థిరమైన, సమగ్ర మార్గాన్ని అందిస్తుంది.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికల ప్రకారం గత దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వివిధ సాయుధ సంఘర్షణలు ప్రధానంగా అధికారం పట్ల నిషేధం విధించే ప్రబలమైన పాలక వ్యవస్థల కిందే చోటుచేసుకున్నాయి. ముఖ్యం గా మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా, ఉప సహారా ఆఫ్రికాలో ఇవి మరింత తీవ్రంగా కనబడుతున్నాయి. ఈ హింస తీవ్ర మానవీయ సంక్షోభాలకు కారణమవ్వడంతో పాటు, ఆర్థిక పురోగతిని అడ్డుకుంటూ, సామాజిక సమగ్రతను చెదరగొట్టాయి. దీని విరుద్ధంగా, ప్రజాస్వామ్య పాలనను స్వీకరించిన దేశాలు ఎక్కువ స్థిరతను, అభివృద్ధిని సాధించాయి. ఉదాహరణగా కోల్డ్‌వార్ ముగిసిన తర్వాత, ప్రజాస్వామ్య మార్గాన్ని అవలంబించిన తూర్పు యూరోప్ దేశాలు, రాజకీయ స్థిరతను, ఆర్థిక వృద్ధిని అనుభవించాయి. మార్పు సులభంగా రాకపోయినా, దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్యం, పౌరసంబంధాల పెరుగుదల, ప్రభుత్వ జవాబుదారీతనం, మానవ హక్కుల పరిరక్షణ వంటి ప్రయోజనాలను అందించింది.
అరబ్ స్ప్రింగ్ ప్రజాస్వామ్య పోరాటానికి, సాయుధ పోరాటానికి మధ్య వ్యత్యాసాన్ని బహిరంగంగా చూపిస్తుంది. ట్యూనీషియాలో ప్రశాంత ఉద్యమం ప్రజాస్వామ్య సంస్కరణలకు దారి తీసింది. అయితే సిరియా లాంటి దేశాలు సాయుధ పోరాటంలో నలిగిపోగా, అవి తీవ్ర మానవీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ తీవ్ర అస్థిరతను అనుభవించాయి. సమాచార విశ్లేషణలు కూడా ప్రజాస్వామ్య మార్గాన్నే సమర్థిస్తున్నాయి. జర్నల్ ఆఫ్ పీస్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ప్రజాస్వామ్య దేశాలు, నియంతృత్వ పాలన కలిగిన దేశాలతో పోలిస్తే అంతర్గత సంఘర్షణలను తక్కువగా ఎదుర్కొంటాయని కనుగొన్నారు.
భారతదేశంలోని నక్సలైట్, మావోయిస్టు తిరుగుబాటు, సామాజిక-, ఆర్థిక అసమానతలు, రాజకీయ వివక్షను ఎదుర్కొనే అసంతృప్తుల నుండి జన్మించింది. అయితే, ఇది సాయుధ పోరాటాన్ని ఆశ్రయించడంతో వేలాది మంది మరణించగా ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటు నక్సలైట్ ఉద్యమానికి ఆరంభంగా మారింది. ఆ తర్వాత, ఇది పెద్ద ఎత్తున రక్తపాతం, విధ్వంసం సృష్టిస్తూ దేశంలోని తూర్పు, మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో విస్తరించింది. 1980 నుండి 2015 మధ్యకాలంలో ఈ ఉద్యమం 20,012 మంది మరణాలకు కారణమైంది. ఇందులో 4,761 మంది నక్సలైట్లు, 3,105 మంది భద్రతా సిబ్బంది, 12,146 మంది సాధారణ పౌరులు ఉన్నారు. 2010 నుండి సంవత్సరానికి సగటున 417 మంది సాధారణ పౌరులు మావోయిస్టుల హింసకు బలయ్యారు.
నక్సలైట్ హింస వల్ల పలు రాష్ట్రాల్లో పెట్టుబడులు తగ్గిపోయాయి, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోయింది, విద్య-, ఆరోగ్య సేవలు ప్రభావితమయ్యాయి. పేదరికం, వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకపడటం జరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అనేక వ్యూహాలను ప్రయోగించింది. 2009లో ప్రారంభమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ కింద 75,000 మంది సైనికులు, పారామిలిటరీ దళాలను నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు.
అయితే, దీనివల్ల కొంతమంది తిరుగుబాటుదారులను నిర్మూలించినా, అనేక మందిపై మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు రావడంతో ఈ పోరాటం మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీలు వేరైనా కాంగ్రెస్, బిజెపి నేతల అసలు లక్ష్యం ఈ దేశంలో అడవులు, గనులు, పోర్టులు, ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజల సహజ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేయడమే. కనుక ఈసారి చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా ‘మావోయిస్టు రహిత భారత్ అనే స్వప్నం సాకారమవుతోంది’ అన్నారు. త్వరలో దేశంలో ‘మావోయిస్టు ఉద్యమం’ అంతరిస్తుంద’ని అన్నారు. ఇంతకు ముందు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు నక్సల్స్‌ను రూపుమాపేందుకు ఫేక్ ఎన్‌కౌంటర్లతో సైనిక బలగాలతో వైమానిక దాడులు చేశారు. ఆధునిక ఆయుధాలతో ఉద్యమాన్ని అణచివేసేందుకు గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు. అయినా అది కొనసాగుతూనే ఉంది. కానీ ఎందరో నక్సల్స్ మరణించినా ఈ ఉద్యమం ఏం సాధించింది? ఆత్మపరిశీలన చేసికొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. రాజ్యం బలంగా ఉంది. కక్షతో ఉంది. ఇప్పుడు ఉన్న దారి వెనుకకు తగ్గటం మంచిది.
నక్సలైట్ ఉద్యమం దశాబ్దాలుగా సాగుతున్నా తన లక్ష్యాలను సాయుధ పోరాటం ద్వారా సాధించలేకపోయింది. దీని విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని స్వీకరించిన రాష్ట్రాలు మేలైన అభివృద్ధిని సాధించాయి. ఉదాహరణగా కేరళను పరిశీలిస్తే అక్కడ వామపక్ష రాజకీయాలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు కట్టుబడి ఉండటం వల్ల అది నక్సలైట్ హింసను నివారించగలిగింది. సమగ్ర భూసంస్కరణలు, సమాజ సంక్షేమ కార్యక్రమాలు, విద్య -ఆరోగ్య రంగాల్లో మెరుగైన అభివృద్ధి కేరళను మిగిలిన రాష్ట్రాల కంటే ముందుకు నడిపించాయి.
ఇక ఢిల్లీలో అవినీతికి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించి విజయాన్ని సాధించింది. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి విద్య, ఆరోగ్యం, ఇతర ప్రజాసేవలను మెరుగుపరిచింది. ఇది ప్రజాస్వామ్య మార్గంలో మార్పు సాధ్యమనే విషయాన్ని నిరూపించింది. నక్సలైట్ ఉద్యమం పూర్తిగా హింసను వదిలిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రభుత్వం తిరుగుబాటుదారుల ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
భూసంస్కరణలు, గ్రామీణ అభివృద్ధి, సామాజిక, -ఆర్థిక, న్యాయం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. తిరుగుబాటుదారులకు సామాజిక జీవితంలో తిరిగి చేర్చేందుకు పునరావాస ప్రణాళికలు రూపొందించాలి. సాయుధ పోరాటం ద్వారానే మార్పును తేవగలదనే లక్ష్యంగా ఉండవచ్చు. కానీ, చారిత్రకంగా చూస్తే ప్రజాస్వామ్య మార్గమే స్థిరమైన పరిష్కారం. హింసను వదిలిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధిని, శాంతిని సాధించవచ్చు. నక్సలైట్ ఉద్యమం అసమానతల సమస్యలనుండి పుట్టినా హింసాత్మక మార్గాన్ని అనుసరించడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రజాస్వామ్య మార్గాన్ని స్వీకరించడం ద్వారానే అసమానతలను తగ్గించి, అభివృద్ధి సాధించగలం. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతి, న్యాయబద్ధమైన మార్పు రావాలంటే ప్రజాస్వామ్య మార్గాన్నే అనుసరించాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496