Sunday, January 19, 2025

కెనడా ప్రధాని తప్పుమీద తప్పులు..

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ సైన్యంలో ఉండి పోరాడిన యుద్ధ వీరుడికి పురస్కారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది. కెనడా పార్లమెంట్‌కు అప్పటి నాజీ పక్ష సైనికుడు, 98 ఏండ్ల యారోస్లావ్ హంకాను పార్లమెంట్‌కు ఆహ్వానించి , సన్మానించడం ఘోర తప్పిదం అని, ఇందుకు క్షమాపణ చెపుతున్నానని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గురువారం ప్రకటించారు. పార్లమెంట్ నాజీ హీరోను సన్మానించడం దేశ చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రస్థాయి దౌత్యపరమైన తప్పిదం అని కెనడాలోని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హంకాకు ఇటీవల కెనడా పార్లమెంట్ పెద్ద ఎత్తున స్వాగతం పలికింది. సభలో ఆయనకు సభ్యులు అంతా లేచి కరతాళధ్వనులతో స్వాగతం పలికి ఆయనను ఉక్రెయిన్, కెనెడియన్ హీరో అని పొగిడారు. అప్పటి సోవియట్ యూనియన్ పెత్తనం నుంచి ఉక్రెయిన్‌ను రక్షించేందుకు ఈ నాజీ హీరో పాటుపడ్డారని కెనడా పార్లమెంట్ స్పీకర్ ఆంటోనీ రోటా శ్లాఘించారు. ఈ దశలో పార్లమెంట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ, ట్రూడో కూడా ఉన్నారు. వారు లేచి నిలబడి ఈ నాజీ హీరోను అభినందించారు.

అయితే నాజీల దురాగతాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్లమెంట్‌లో సన్మానం జరగడం వివాదాస్పదం అయింది. ప్రపంచవ్యాప్తంగా కెనడాపై విమర్శలు తలెత్తాయి. స్పీకర్ తమ తప్పిదానికి ఫలితంగా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన విషయంపై తాను క్షమాపణ చెపుతున్నట్లు తెలిపిన ట్రూడో , ఈ విషయంలో ఉక్రెయిన్‌కు కూడా జరిగిన విషయంలో చింతిస్తున్నట్లు తెలిపేందుకు దౌత్యవర్గాల ద్వారా రంగంలోకి దిగారు. నాజీ సైనిక దళంలో హిట్లర్ తరఫున పనిచేసిన వ్యక్తికి కెనడాలో బ్రహ్మరథం పట్టడంపై రష్యా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. వెంటనే కెనడా అధికారికంగా వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని తన ప్రత్యర్థులను రష్యా అధినేత నియో నాజీలుగా తిట్టిపోస్తున్నారు. పాశ్చాత్య దేశాలు కొన్ని ఈ విధంగా కావాలనే ఉక్రెయిన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీయాలని చూస్తున్నాయని పుతిన్ విమర్శించారు. ఖలీస్థాన్ వివాదం విషయంలో భారతదేశం నుంచి తీవ్రస్థాయిలో వివాదం కొనితెచ్చుకున్న ట్రూడోకు ఇప్పుడు ఈ సరికొత్త సమస్య తలెత్తింది. దీని పరిణామాలు ఏమిటనేవి అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News