Saturday, November 23, 2024

బీజేపీ వ్యతిరేక మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరం?

- Advertisement -
- Advertisement -

రాజౌరీ/జమ్ము: వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో ఏర్పాటవుతున్న మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి)ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శనివారం సంకేతాలు అందించారు. ఆర్టికల్ 370 రద్దయినప్పుడు ఆయా పార్టీలన్నీ మౌనం దాల్చాయని వ్యాఖ్యానించారు. కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయన్న ఊహాగానాల సమయంలో ఎన్నికల ముందు పొత్తు గురించి మాట్లాడడం సమంజసం కాదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ బయట తామేం చేయగలమని అన్నారు. తమకు మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలున్నాయని, ఈ స్థానాలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపికి వ్యతిరేకంగా విపక్షాలతో ఏర్పాటవుతున్న మహాకూటమితో నేషనల్ కాన్ఫరెన్స్ చేతులు కలిపే అవకాశం ఉందా ? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒత్తిడులు పక్కన పెట్టంది. అలాంటి కూటమి వల్ల జమ్ముకశ్మీర్‌కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

“వారికి మనం అవసరమైతే మన తలుపులు తడతారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ చిక్కుల్లో ఉన్నందున ఆయనకు మన మద్దతు అవసరమౌతోంది. కానీ 2019 లో మనం చాలా పెద్ద వంచనకు గురైనప్పుడు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారు ? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ముకశ్మీర్ ను జమ్ము, కశ్మీర్, లడఖ్‌గా కేంద్ర ప్రభుత్వం విడదీసినప్పుడు ఈ నాయకులంతా ఎక్కడ ఉన్నారు ? ఎవరు జమ్ముకశ్మీర్ ప్రజల పక్షాన నిలబడ్డారు ? అని ప్రశ్నించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ అంటూ గోల చేస్తున్నవారు ప్రజాస్వామ్యహత్యకు మనం గురైనప్పుడు వారెక్కడ ఉన్నారు ? అని ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లోకూడా వారు మాట్లాడలేదు. పైగా దీనికి మద్దతు ఇచ్చారు. అయితే డిఎంకె, మమతా బెనర్జీ నాయకత్వ టిఎంసి, రెండు వామపక్షాలు ఈ నాలుగు పార్టీలు మాత్రమే జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటున్నాయని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్య
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఆలస్యంపై అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పలేక విసిగెత్తిపోయానని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఎన్నికలకు బీజేపీ రెడీ అయితే ఎన్నికలు జరిగి ఉండేవని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతపై హోం మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందగానే ఎన్నికల తేదీలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ స్వయంగా చెప్పారని , అయితే ఇంతవరకు వారికి ఎలాంటి సమాచారం అందకపోవడం అర్ధం కావడం లేదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో పాలనా పరంగా శూన్యత ఉన్నట్టు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ అంగీకరించారని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను తగ్గించడానికి, ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలని, కానీ ప్రజాసమస్యలను అధికారయంత్రాంగం పట్టించుకోకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఘల్ రోడ్‌లో సెక్యూరిటీ చెక్ పాయింట్లు వద్ద చాలా పొడవైన క్యూలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్న ప్రశ్నకు రెండు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లో ఉగ్రవాదుల హింసాత్మక సంఘటనలు ఎక్కువగా పెరిగాయని, ఇదంతా అధికార యంత్రాంగ వైపల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో నరేంద్రమోడీ తొమ్మిదేళ్ల పాలనలో అనూహ్యమైన అభివృద్ధి చెందినట్టు బీజేపీ చెబుతోంది కదా అని ప్రశ్నించగా, ఒకసారి ఎన్నికలు జరిగితే ప్రతీదీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News