Monday, January 20, 2025

చరిత్ర పుస్తకాల్లో మార్పులు!

- Advertisement -
- Advertisement -

ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎన్‌సిఇఆర్‌టి ప్రచురించిన భారత చరిత్ర పాఠ్యాంశాల్లో కొన్ని భాగాల తొలగింపు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముఖ్యమైన కొన్ని చారిత్రక సంఘటనలను, భాగాలను తొలగించడం పైన జరిగిన చర్చలో ధర్మాగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుత విద్యా విధానంలో ఒక వైరి భావాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఈ వివాదంలోని మూడు కోణాల గురించి వ్యాఖ్యానించ దలుచుకున్నాను. విద్యకు పాఠ్య పుస్తకాలు ఎందుకు కీలకం; భారత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో తొలుత ఉన్న ధోరణిని ఏకపక్షంగా ఎందుకు తొలగించారు; ఇలా చేయడం వల్ల ఏం ప్రయోజనం.
పాఠ్య పుస్తకాలు కనీసం మూడు పనులు చేస్తాయి. ఒక అంశానికి సంబంధించిన మౌలిక సమాచారాన్ని ఒకే దగ్గరకు తీసుకొస్తాయి. అక్కడి నుంచి వాటి ప్రాధాన్యత ప్రకారం స్థాయి లేర్పడతాయి. కింది తరగతుల్లో తేలికగా ఉండి, పై తరగతులకు వెళ్ళిన కొద్దీ వాటి స్థాయి పెరుగుతుంది.

దీన్ని పునరావృతంగా భావించనవసరం లేదు. చరిత్రను ఈ రెండు దశల్లో ఉన్న తేడాను ఎలా చూస్తారో పరిశీలిద్దాం. ఆయా అంశాల్లో విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి వారు ప్రశ్నించేలా మంచి పాఠ్య పుస్తకాలు ప్రోత్సహిస్తాయి. జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రశ్నలు వేయడం, ఏ అంశంలోనైనాసరే ఏ ప్రశ్నలున్నాయో అన్వేషించడం అవసరం. విద్య అనేది ఆదర్శంగా ప్రోత్సహించ డానికే ఉన్నది. ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించడానికి, మన సమాజంలో, సంస్కృతిలో ఆ అంశం ప్రాముఖ్యత ఏమిటో వివరించడానికి పాఠ్య పుస్తకం తోడ్పడుతుంది. జెస్యూట్ (రోమన్ క్యాథిక్‌లిక్ ప్రచారకులు), ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థల సభ్యులుగా తయారయ్యే పౌరులకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనేది చాలా ముఖ్యం. పాఠ్య పుస్తకాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించాలి. ఎన్‌సిఇఆర్‌టి ఒకటి, రెండు సెట్ల పుస్తకాలు రాసినప్పుడు అలాంటి దృష్టిని కల్పిస్తుంది. పాఠ్యపుస్తకాల్లో కోత విధించి, తొలగించేస్తే ఆ పుస్తకాల ప్రాథమిక లక్ష్యం విద్య కాదని అర్థమైపోతుంది.

కోత విధించగా మిగిలిన పాఠ్యాంశాలను బోధించేటప్పుడు ఏ రకంగానూ ప్రశ్నించడానికి వీలు లేకుండా పౌరులను తయారు చేస్తాయి. విద్యను కేవలం అకారాధిక క్రమంలో నేర్చుకోవడం, ప్రాథమికంగా చదువుకోవడం కాదు. ఉన్నదానికి అతీతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. ఇప్పుడు చేస్తున్న ఆర్థిక కేటాయింపులకు మరికొంత పెంచాలి. మనం నివసించే ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా ప్రశ్నించడానికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఈ క్రమంలో చరిత్ర కీలక పాత్రను నిర్వహిస్తుంది.
కొనసాగుతున్న సంఘటనలపై చరిత్ర ఆధారపడి ఉంటుంది. దానిలో చాలా భాగాన్ని తొలగించడం వల్ల ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుంది. మధ్య యుగాలలో ఉన్న “ముస్లింల చరిత్ర”ను మినహాయించి, ప్రాచీన కాలం నుంచి క్రీస్తు తరువాత రెండవ సహస్రాబ్దిలోకి ఎగిరి గంతేస్తే అంతులేని గందరగోళం ఏర్పడుతుంది. సంఘటనల ప్రభావాన్ని చర్చించేటప్పుడు మధ్యలో ఉన్న ఖాళీలు అడ్డుపడతాయి.

వివిధ చర్యల మధ్య ఉన్న సంబంధాలను చర్చించడానికి చేసిన తొలగింపులు కీలకమైన చర్చను రద్దు చేస్తుంది. హంతకుడి ప్రస్థావన లేకుండా గాంధీజీ హత్య గురించి, హంతకుడి ఉద్దేశం ఏమిటి, ఈ సంఘటన జరిగిన తరువాత రాజకీయ పరిణామాలేమిటన్న విషయం నిజంగా ఎవరైనా చర్చించగలరా? తారీకులను పేర్కొంటూ సంఘటనలను గుదిగుచ్చడం చరిత్రకాదు. ఒక సంఘటనను చారిత్రకంగా అర్థం చేసుకోవడానికి దాని సందర్భాన్ని చర్చించడం చాలా కీలకం. ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఒక ప్రత్యేకమైన మతస్థులే ధ్యేయంగా ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు హత్యలు చేశారన్న దానిపై చర్చించేటప్పుడు ఇది అన్వయమవుతుంది. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణ కాండను ఎన్‌సిఇఆర్‌టి మినహాయించినట్టు పాఠ్య పుస్తకాల్లో కొన్ని భాగాలను తొలగించడం ద్వారా అలాంటి చర్యలను ఖాళీగా వదలలేము. ఇలాంటి సంఘటనలు సామాజిక జ్ఞాపకాల్లో, ప్రజల్లోను, నిశ్శబ్దంగానైనా సజీవంగా ఉంటాయి. అవి ఇతర పుస్తకాల్లో చర్చనీయాంశమై మర్చిపోలేనివవుతాయి. అది రాజకీయ ఖైదీల జైలు (రష్యాలో) గులగ్‌లా తయారవుతుంది.
అఖిల భారత స్థాయిలో పాఠ్య పుస్తకాల్లో ఎన్‌సిఇఆర్‌టి తీసుకొచ్చిన మార్పుల ప్రకటనలో గందరగోళం చోటు చేసుకుంది. ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. అయోమయంలో ఉండిపోయిన వారి ప్రయోజనం ఏమిటో స్పష్టంగా లేదు. వాళ్ళు చెప్పే ‘హేతుబద్ధీకరణ’ అర్థం ఏమిటనేది మొదటిది. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా పదకొండు, పన్నెండవ తరగతి పాఠ్య పుస్తకాల్లో వాక్యాలు, భాగాలు, చాప్టర్లు తొలగించడాన్ని ఎలా సమర్థించుకుంటారన్నది రెండవది. గాంధీజీని ఒక బ్రాహ్మణుడు హత్య చేశాడన్న విషయం తొలగించడం అనేది కరోనా కాలంలో చదువుల భారాన్ని తొలగించడానికి ఎలా ఉపయోగపడుతుంది? తెలివి గల 12వ తరగతి విద్యార్థులకైనా చరిత్ర పాఠాలు చెక్కు చెదరకుండా అట్టిపెట్టి ఉండవలసింది. తార్కికంగా, హేతుబద్ధంగా ఈ పనిచేయలేదని స్పష్టమవుతోంది.

పాఠ్యాంశాల్లో మార్పులు చేయడానికి కరోనా కారణం కాదని స్పష్టమవుతోంది. ఆ సిద్ధాంతంతోనే చరిత్ర పాఠాలు చెప్పాలనే పట్టుదలతో, వాటిని అదుపులో పెట్టుకోవాలనే తమ సిద్ధాంతానికి తగినట్టుగా మార్పులు చేశారు. ఆ పేరాలు, వాక్యాలు ఎందుకు తొలగించవలసి వచ్చిందో హేతుబద్ధంగా వివరించడం ద్వారా తొలగింపులకు న్యాయం చేకూర్చవచ్చు. తొలగించినవి గమనిస్తే ఉద్దేశపూర్వకంగా చేసినట్టు స్పష్టమవుతోంది. చాలా మంది లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్‌సిఇఆర్‌టి నుంచి తగిన సమాధానం లేదు. అనుమానం లేదు, వాళ్ళ పథకం సుస్పష్టం. వారి బృంద నిపుణులే రాసి ఎన్‌సిఇఆర్‌టి మూడవ సెట్‌ను అచ్చు వేస్తారు. గతంలో జరిగిన ఏదైనా సంఘటనను పన్నెండవ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలో ప్రస్తావనకు వస్తే కేవలం ఏ విషయం పేర్కొన్నారన్న దానికి పరిమితం కాకుండా ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనేది కూడా చర్చించాలి. క్రీ.శ. 600 1800 మధ్య, 600 సంవత్సరాల మధ్యయుగాల చరిత్రలో తగ్గించేసింది కేవలం 300 సంవత్సరాల చరిత్ర కాదు. చరిత్రలో అది ప్రధాన భాగం.

దీర్ఘ కాల చరిత్రలో ముఖ్యమైన సంఘటనలను ఎంపిక చేసుకుని, చర్చించి, దానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, స్థలాన్ని తగ్గించేశారు. మరొక రకంగా చెప్పాలంటే ఏవైతే ఆలోచింప చేసేవో అలాంటి చెప్పుకోదగ్గ సంఘటనలనే తీసేశారు. పేజీలను, చాప్టర్లను తగ్గించడాన్ని తెలివి తక్కువదిగా అభివర్ణిస్తున్నారు. తొలగించడానికి ఎన్‌సిఇఆర్‌టి వివరించే కారణాలు ఆమోదింప చేసేలా లేవు. పాఠ్యప్రణాళికలో చరిత్ర ప్రమాణాలను పెంచేలా వారి ఉద్దేశం లేదు. పాఠ్యాంశాల్లో భాగాల తొలగింపు ఎలా ఉందంటే వారు ఎంపిక చేసిన చరిత్రలో వారు చెప్పేవే చదవాలనేట్టుగా ఉంది.
మరొక గందరగోళం కూడా అంటిపెట్టుకుని ఉంది. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాలను తొలుత రొమిల్లా థాపర్, అర్జున్ దేవ్, ఆర్.ఎస్.శర్మ, సతీష్ చందర్, బిపిన్ చంద్ర 196070 మధ్య రాశారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పుస్తకాలను నిషేధించాలని భావించారు కానీ, ఆ పని చేయడానికి ముందే ఆయన ప్రభుత్వం పడిపోయింది. బిజెపి ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనల్లో ఈ చరిత్రకారులను అంగీకరించలేదు. వీరు మార్క్సిస్టులు, వామపక్షవాదులని, చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ఒత్తిడి చేశారు. అందరూ నవ్వుకునేలా ఊహాజనితమైన వాటితో చరిత్రను రచించదలుచుకున్నారు. నూతన చరిత్ర పుస్తకాల రచనకు 1999లో బిజెపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంఘ్ పరివార్ రాజకీయాలకు అనుకూలంగా చరిత్ర రచనకు కొంత మంది చరిత్రకారులు సిద్ధమయ్యారు. బిజెపి ప్రభుత్వం 2004లో అధికారానికి రాకపోవడంతో ఇది అమలు కాలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, అప్పుడున్న పాఠ్య గ్రంథాలు 40 ఏళ్ళ క్రితం నాటివని, వాటిని తిరిగి రాయించాలని నిర్ణయించింది. కొత్త పాఠ్య పుస్తకాల్లో రెండవ సెట్‌ను చరిత్రకారులు రాశారు. వీరు గతంలో ఎన్‌సిఇఆర్‌టికి రాయలేదు. కొత్త దృక్పథంతో రాసిన వీరిని వృత్తిపరమైన చరిత్రకారులు ఎంపిక చేశారు. వారిపైన మార్క్సిస్టులు అని ముద్ర వేయలేదు. వీరు రాసిన చరిత్ర రెండవ సెట్ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆమోదించలేదు సరికదా, ప్రస్తుత ప్రభుత్వం ఆమోదించని ఈ చరిత్రకారులపైన దాడి మొదలు పెట్టారు.
ఈ చరిత్ర కారులు రాసిన పుస్తకాలు రెండు దశాబ్దాలుగా మూలన పడేసి ఉన్నాయి.

రెండవ సెట్ రచయితల పేర్లు తెలియకపోయినప్పటికీ, తొలి రచయితలు కూడా ఈ వ్యతిరేక ప్రచారానికి గురవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వాలు మారడం, పాఠ్య పుస్తకాలు మారడం మధ్య ఉన్న సంబంధంపైన అనేక చలోక్తులు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం మారితే పాఠ్య పుస్తకాలు కూడా మారిపోతాయి. పాఠ్య పుస్తకాల రచనా విభాగం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, సంబంధిత విభాగంలోని ప్రసిద్ధ నిపుణుల చేతిలో ఉండాలని మాలో కొందరు యుపిఎ ప్రభుత్వానికి 2005లో గట్టిగా లేఖ రాశారు. పాఠ్యపుస్తకాల రచనకు ప్రసిద్ధమైన నిపుణులను ఎంపిక చేయాలని కోరారు. ఈ రోజు ఎంపిక చేసిన నిపుణుల కంటే గతంలో ఎంపిక చేసిన నిపుణులు తమ తమ విభాగాల్లో చాలా ప్రసిద్ధులు. వివిధ విభాగాల్లో ప్రత్యేక అధ్యయనాలు పెరిగాయి కనుక శిక్షణకు నిపుణుల అవసరం ఎంతైనా ఉంది.

ఆయా విభాగాల్లో తగిన విధంగా శిక్షణ పొందని, బోధనా పద్ధతులు తెలియని వారి చేతికి పాఠ్య పుస్తకాల రచనను అప్పగించరాదు. మేం రాసిన లేఖలకు, వాటిని గురించి గుర్తు చేసేవాటికి స్పందన లేదు. ప్రతి ఒక్కటీ యువతరానికి బోధించడం కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రశ్నించాలో నేర్పించడం ద్వారా వారి మనసులను చూరగొంటాం కనుక మా విజ్ఞప్తిని ఏ రాజకీయ పార్టీ ఆమోదించదు. స్వతంత్రంగా పౌరులు ఆలోచించి, ప్రశ్నించడం నేర్చుకుంటే అధికారంలో ఉన్న వారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ధోరణిని పూర్తిగా తుడిచిపెట్టేశారు. విద్య కేవలం మత సంబంధమైన ప్రశ్నోత్తరాల గ్రంథం (కాటేచిజం)గా తయారైంది. యువతరం సొంతంగా ప్రశ్నించడాన్ని, ఆలోచించడాన్ని ఇది నేర్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News