Monday, December 23, 2024

పుస్తకాల తిరగరాత.. ఇక ఇండియా బదులు భారత్

- Advertisement -
- Advertisement -

పుస్తకాల తిరగరాత
ఇక ఇండియా బదులు భారత్
ఎన్‌సిఇఆర్‌టి కీలక ప్రతిపాదన..
చరిత్రకూ కొత్త రూపం ఇక క్లాసికల్ హిస్టరీ
న్యూఢిల్లీ: విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో ఇకపై ఇండియా బదులు భారత్ అనే పేరు చేర్చాలని జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) బృందం ఇటీవల ప్రతిపాదించింది. ఎన్‌సిఇఆర్‌టి ప్రచురించే పుస్తకాలలో అప్పుడప్పుడు మార్పులు చేర్పులతో కూడిన సిలబస్‌ను రూపొందించడం ఆనవాయితీగా ఉంది. ఇండియా బదులు భారత్ పేరు మార్పిడి ప్రతిపాదనకు మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీనితో ఇకపై ఎన్‌సిఇఆర్‌టి వెలువరించే పాఠ్యపుస్తకాలలో భారత్ పేరు ఉండేందుకు అవకాశం ఏర్పడింది.

అయితే ఎన్‌సిఇఆర్‌టికి చెందిన చిన్న కమిటీ ఈ ప్రతిపాదనను వెలువరించిందని, పూర్తి స్థాయిలో దీనికి సమ్మతి దక్కి, కార్యరూపం దాల్చేందుకు మరికొంత పరిశీలన అవసరం అని వెల్లడైంది. ఢిల్లీలోని ఎన్‌సిఇఆర్‌టి సమీక్షకు ఇప్పుడు ఈ ప్రతిపాదనను పంపించారు. ఎన్‌సిఇఆర్‌టికి చెందిన ఈ ప్యానెల్‌కు విద్యావేత్త ఐసి ఐజాక్ సారథ్యం వహిస్తున్నారు. దేశం పేరును ఇప్పుడున్న ఇండియా బదులుగా భారత్ అని మార్చాలని ఇటీవలి కాలంలో జరిగిన జి 20 సమ్మిట్ దశలోనే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది.

తాజాగా ప్రతిపక్షాలు సంఘటితం అయ్యి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నందునే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇండియా బదులు భారత్‌గా మార్పునకు రంగం సిద్ధం చేసుకున్నదనే విమర్శలు తలెత్తాయి. అయితే ఇప్పటికైతే దేశం పేరు మార్పిడి అంశం పక్కకు వెళ్లింది.రాజ్యాంగంలోని 1(1) అధికరణ మేరకు దేశం పేరు ఇండియాగా ఉంది.

దేశం రాష్ట్రాల సమాఖ్య ఉంటుందని, సమాఖ్య విధానం సంతరించుకుంటుందని రాజ్యాంగంలో తెలిపారు. ఇప్పుడు ఎన్‌సిఇఆర్‌టి తలపెట్టిన ఇండియా పేరు చేరిక విషయం ప్రతిపక్షాల విమర్శలకు ఆధారం కానుంది. కాగా ఇప్పుడు ఎన్‌సిఇఆర్‌టి చేసిన ప్రతిపాదనలలో మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి చరిత్రపై దృష్టి సారించారు. హిందూ రాజ్యాల విజయాలను ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. ఇక ఇప్పుడు చరిత్ర పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రాచీన చరిత్ర స్థానంలో శాస్త్రీయ లేదా క్లాసికల్ హిస్టరీని రూపొందించాలని ప్రతిపాదించారు.

చరిత్రను ప్రాచీన, మధ్యయుత, ఆధునిక చరిత్రలుగా పేర్కొనడం అనుచితం అని విద్యావేత్త, సంబంధిత ప్యానెల్ ఛైర్మన్ ఐజాక్ తెలిపారు. ఇటువంటి విధానం బ్రిటిష్ వారి హయాంలో తీసుకువచ్చారని, పూర్వం దేశం పూర్తిగా వెనుకబడి, చీకట్లో మగ్గిందని, శాస్త్రీయపురోగతి లేకుండా అజ్ఞానంలో ఉందని తెలిపే విధంగా చరిత్రలో అధ్యాయాలు నిర్ధేశించారని ఐజాక్ అభిప్రాయపడ్డారు. ఇక అన్ని రకాల సిలబస్‌లలోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్)ను ఏర్పాటు చేయాలని కూడా ప్యానెల్ ప్రతిపాదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News