పుణే: మహారాష్ట్ర గవర్నర్ బిఎస్. కొష్యారీ ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వివిధ మరాఠ గ్రూపులు, ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పుణే బంద్‌ను పాటించాయి. నగరంలోని అనేక దుకాణాలు, వివిధ మార్కెట్లు మూసి ఉంచారు. “ఈ బంద్‌కు ఒక్క బిజెపి తప్ప అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఇది మహారాష్ట్రకే ఓ అవమానం” అని పుణే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ జగతప్ అన్నారు.
ఔరంగాబాద్‌లో నవంబర్ 19న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడ యూనివర్శిటీలో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ప్రసంగిస్తూ “ఒకవేళ మీ ఆదర్శం ఎవరంటే, మీరు వెతుక్కోనవసరం లేదు. వారిని మీరు నేడు మహారాష్ట్రలో చూడొచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత దిగ్గజం’ అయిపోయారు, మీరు కొత్త దిగ్గజాన్ని ఎంచుకోవాలి…బాబా సాహెబ్ అంబేడ్కర్ మొదలుకొని నితిన్ గడ్కరీ వరకు” అని వ్యాఖ్యానించారు. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్య మహారాష్ట్రలో ఉద్రేకాలను పెంచింది.
ఛత్రపతి శివాజీని అవమానించినందుకు, మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదంపై, గవర్నర్ కోష్యారీని పదవీచ్యుతుని చేయాలని కోరుతూ డిసెంబర్ 17న ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనను ప్రతిపక్షంలో ఉన్న మహారాష్ట్ర వికాస్ అఘడి(ఎంవిఎ) డిసెంబర్ 6న ప్రకటించింది.
పత్రికా విలేకరులు సమావేశంలో ఉద్ధవ్ థాక్రే ప్రసంగిస్తూ “ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 17న మోర్చా నిర్వహిస్తాము. జీజామాతా ఉద్యానం నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్ వరకు ఈ మోర్చా నిర్వహిస్తాము. మహారాష్ట్ర గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తాము. మహారాష్ట్రను అవమానించినందుకు మహారాష్ట్రను ప్రేమించే వారందరూ ఏకీకృతమై ఈ నిరసనలో పాల్గొంటారని ఆశిస్తున్నాను” అన్నారు.