2024 వరకు ఎందుకు? ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాను అని ఒక మరాఠీ వార్త పత్రిక విలేకరి ప్రశ్నకు సమాధానంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ శుక్రవారం నాడు ఇచ్చిన సమాధానం మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం గురించి వస్తున్న వదంతులకు కొంచెమైనా విశ్వసనీయత కలిగిస్తున్నది. ఈ ప్రకటన చేసిన అనంతరం జరిగిన ఎన్‌సిపి సమావేశానికి అజిత్ వెళ్ళలేదు. అజిత్ పవార్ కేంద్రంగా మరో సంక్షోభం గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఖండించినప్పటికీ స్టాక్ మార్కెట్ మహాకుంభకోణంలో ఇరుక్కొన్న గౌతమ్ అదానీకి ఆయన బాహాటంగానే మద్దతు ప్రకటించారు. పదిహేను రోజుల క్రితం అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో జెపిసి డిమాండ్‌ను శరద్ పవార్ తప్పుపట్టారు. అదానీ స్టాక్ మార్కెట్ మోసానికి పాల్పడ్డారని చెప్పిన హిండెన్‌బర్గ్ విశ్వసనీయతను ప్రశ్నించారు. ఆ తర్వాత అదానీ స్వయంగా ముంబైలోని శరద్ పవార్ ఇంటికి వెళ్ళారు.
ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని దించడానికి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రతిపక్షం ఏకమవుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలుగుతున్న దశలో మారిన శరద్ పవార్ వైఖరి ఆయన కాంగ్రెస్ నుంచి, ఇతర ప్రతిపక్షాల నుంచి దూరమవుతున్నారనే అంచనాకు తావిచ్చింది. అజిత్ పవార్ గతాన్ని దృష్టిలో వుంచుకొని చూసినా ఆయన బిజెపితో పొత్తుకు వెనకాడబోరని బోధపడుతుంది. 2019 డిసెంబర్‌లో ఎన్‌సిపి, శివసేన, కాంగ్రెస్ కలిసి బిజెపియేతర ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న దశలో అజిత్ పవార్ ఎన్‌సిపి నుంచి వేరుపడి బిజెపితో చేతులు కలిపి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ చక్రం తిప్పి అజిత్ పవార్‌ను తిరిగి వెనుకకు రప్పించడంతో ఆ ప్రభుత్వానికి అప్పుడు తెరపడిపోయింది. ఆ రుచి వదలని అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో మళ్ళీ లాలూచీకి వెనకాడకపోవచ్చు. అలాగే శివసేనలో పరిణామాల వల్ల భవిష్యత్తులో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం పుట్టి మునిగిపోయే సూచనలు లేకపోలేదు.
షిండే వర్గం శివసేన నుంచి వేరుపడి బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై విశ్వాస ఓటుకు అనుమతి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. 38 మంది ఎంఎల్‌ఎలు గల తమ వర్గం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నాయకత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయిందని ఏక్‌నాథ్ షిండే చెప్పారంటే అది వారి పార్టీ అంతర్గత వ్యవహారమని దానిని ఆధారం చేసుకొని గవర్నర్ విశ్వాస ఓటుకు ఆదేశించకుండా వుండవలసిందని సిజెఐ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తీర్పును వాయిదా వేసినట్టు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ప్రకటించింది. అంతిమ తీర్పులో షిండే వర్గ శాసన సభ్యత్వాలను రద్దు చేసినట్లయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి తలెత్తవచ్చు. అప్పుడు బిజెపి తన పాత మిత్రుడు అజిత్ పవార్ మీద ఆధారపడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పక్షాలను ఒకటొకటిగా దెబ్బ తీసే వ్యూహాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఇప్పటికే ఆప్ వంటి పార్టీలను అది లక్షంగా చేసుకొన్నది. మహారాష్ట్రలో సిఎం షిండే పట్ల బిజెపి పెద్దలకు మక్కువ పూర్తిగా సన్నగిల్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 288 శాసన సభా స్థానాల్లో అత్యధిక స్థానాలకు పోటీ చేయదలచినట్టు మహారాష్ట్ర బిజెపి ప్రకటించింది. సిఎం షిండే వర్గానికి కేవలం 48 స్థానాలనే విడిచిపెట్ట దలచినట్టు వెల్లడించింది. షిండే ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ రాష్ట్ర పాలనలో ప్రధాన పాత్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ పవార్ వర్గాన్ని చీల్చినట్లయితే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఖాయం. శివసేనలో చీలిక ఆ పార్టీని తీవ్రంగా దెబ్బ తీసింది. దాని పతనంతో ఎన్‌సిపి బలపడుతుందనే అభిప్రాయం నెలకొన్నది. అజిత్ పవార్‌ను ప్రయోగించి ఎన్‌సిపిని కూడా దెబ్బ తీస్తే తమకు మహారాష్ట్రలో ఎదురుండదని బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తూ వుండవచ్చు.