న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో బీడ్‌లో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్‌ఎల్‌ఏ ప్రకాశ్ సోలంకే నివాసంపై సోమవారం నిరసన కారులు దాడి చేసి నిప్పు పెట్టడంతో మొత్తం ఇల్లంతా దగ్ధమైంది. అంతకు ముందు ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. దాడి సమయంలో ఎమ్‌ఎల్‌ఎ సోలంకే ఇంట్లోనే ఉన్నారు. “ దాడి జరిగిన సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. అదృష్టవశాత్తు కుటుంబీకులు, సిబ్బంది, ఎవరికీ గాయాలు కాలేదు. మేమంతా సురక్షితంగా బయటపడ్డాం.
కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించింది.” అని ఎన్‌సీపీ ఎమ్‌ఎల్‌ఏ ప్రకాశ్ సోలంకే పేర్కొన్నారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత ఐదు రోజులుగా ఉద్యోగాలు, చదువుల్లో మరాఠా కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షపై సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా పోటీ చేయలేని వ్యక్తి చురుకైన ఉద్యమ నేతగా తయారయ్యాడని వ్యాఖ్యానించడమే కాకుండా ఈ ఉద్యమం పిల్లలాటగా ఉద్దేశ పూర్వకంగా విమర్శించడం, అది వైరల్ కావడం ఈ ధ్వంసానికి దారి తీసినట్టు తెలుస్తోంది.