ఫరూఖ్ అబ్దుల్లా ధీమా
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంపై పెదవివిప్పారు. మంగళవారం నాడిక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థలకు సాధికారత కల్పించడంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన పక్షంలో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. అయితే 2018 పంచాయతీ ఎన్నికలు, 2019 బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలలో తమ పార్టీ పాల్గొనకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్, విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్న అవగాహనా కార్యక్రమంలో సర్పంచులనుద్దేశించి ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగిస్తూ ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉండాలని హితవు చెప్పారు. ప్రజలను పట్టించుకోని అధికారుల తరహాలో ప్రవర్తించవద్దని ఆయన వ్యాఖ్యానించారు.