పుణె: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సారథ్యంలోని భారత రాష్ట్రీయ సమితి(బిఆర్‌ఎస్) ఇతర రాష్ట్రాలలోకి విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ సోవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ భారత్‌లో పాదం మోపేందుకు మాయావతి, ములాయం సింగ్ యాదవ్ కకూడా ప్రయత్నించి విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ నాయకుడిగా ఎదిగేందుకే కెసిఆర్ తన బిఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చని అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు. తమ సొంత రాష్రాల వెలుపల కూడా ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావచ్చని ఆయన అన్నారు. మహారాష్ట్రలో పాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయం సింగ్ యాదవ్ కూడా తమ ప్రాంతీయ పార్టీలను విస్తరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారని ఆయన చెప్పారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ పారీ పనులను మహారాష్ట్రలో ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్‌సిపి, కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) కూటమి ఎంవిఎలో కాని, బిజెపి, శివసేన(షిండే వర్గం) కూటమిలోకాని టిక్కెట్లు రావన్న భయంతోనే ఎన్‌సిపి, ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరవచ్చని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ, టివిలల ప్రకటనలు గుప్పిస్తూ బిఆర్‌ఎస్ చేస్తున్న భారీ ఖర్చును ఆయన ప్రశ్నించారు.