2021లో ఎన్‌సిడబ్లుకు 31 వేల ఫిర్యాదులు
మహిళలపై నేరాలు యుపిలోనే అత్యధికం
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించి సుమారు 31,000 ఫిర్యాదులు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్లు)కు గత ఏడాది అందాయి. 2014 నుంచి ఇంత అత్యధికంగా ఫిర్యాదులు అందడం ఇదే మొదటిసారి. వీటిలో సగానికి పైగా ఉత్తర్ ప్రదేశ్ నుంచే రావడం గమనార్హం. 2020లో మొత్తం 23,722 ఫిర్యాదులు ఎన్‌సిడబ్లుకు అందగా 2021లో ఇవి 30 శాతం పెరిగాయి. గత ఏడాది అందిన మొత్తం 30,864 ఫిర్యాదులలో 11,013 ఫిర్యాదులు మహిళలు గౌరవంగా జీవించే హక్కును కాలరాసేవి కాగా(మహిళలను భావోద్వేగానికి లోనుచేసే దూషణలు) 6,633 ఫిర్యాదులు గృహ హింసకు సంబంధించినవి. వరకట్నం వేధింపులకు సంబంధించి 4,589 ఫిర్యాదులు అందినట్లు ఎన్‌సిడబ్లు వివరాలు తెలియచేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభాగల ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 15,828 ఫిర్యాదులు అందగా తర్వాతి స్థానంలో ఢిల్లీ(3,336), మహారాష్ట్ర(1,504), హర్యానా(1,460), బీహార్(1,456) ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఫిర్యాదులలో అత్యధికం మహిళలు గౌరవంగా జీవించే హక్కుతోపాటు గృహ హింసకు సంబంధించిన నేరాలు ఉన్నాయి.
NCW Received 31000 Complaints of crimes against Women