ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతీమాలీవాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది. మే 17న అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు మహిళా ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్టు , బిభవ్‌కు రాసిన లేఖలో జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మరి మహిళా ప్యానెల్ ఎదుట బిభవ్ హాజరు అవుతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్‌తోపాటు బిభవ్ కుమార్ కూడా లఖ్‌నవ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ మౌనం
ఈ దాడి ఘటనపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మౌనం వహించగా, ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మైక్ తీసుకుని ఎదురు ప్రశ్నలు వేశారు. ఉత్తరప్రదేశ్‌లో విపక్ష ఇండియా కూటమి భాగస్వామి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి కేజ్రీవాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వారి పక్కడే సంజయ్ మాట్లాడుతూ మణిపూర్ సంఘటనను గుర్తు చేశారు. “ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. లైంగిక దౌర్జన్యం కేసులో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరి వాటి సంగతి ఏమిటి ? దేశ రాజధానిలో జంతర్‌మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో అప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్‌గా ఉన్న స్వాతి మాలీవాల్ మద్దతు ప్రకటించారు. అప్పుడు ఆమెను పోలీస్‌లు ఈడ్చేశారు. కొట్టారు. వీటన్నింటిపై కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మౌనంగా ఉంది. ఆప్ ఒక కుటుంబం. మా పార్టీ తన వైఖరి స్పష్టం చేసింది. నేను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ , బీజేపీ సమాధానం చెప్పాలని కోరుతున్నాను. రాజకీయాలు చేయకండి ” అని ఘాటుగా బదులిచ్చారు. మాలీవాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసిన మాట నిజమేనని సంజయ్ వెల్లడించారు.
బీజేపీ విమర్శ
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గురువారం యూపీ పర్యటనకు వెళ్లగా, ఆయన పక్కన కుమార్ ఉన్నారంటూ బీజేపీ ఆరోపించింది. దానికి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తన నివాసంలో జరిగిన దాడి ఘటన వెనుక కేజ్రీవాల్ ఉన్నారనేది స్పష్టం అవుతోందని విమర్శించింది. దాడి జరిగి నాలుగు రోజులు అవుతున్నా బిభవ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది.
స్వాతీమాలీవాల్‌కు ప్రియాంక మద్దతు
స్వాతీ మాలీవాల్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి దాడి జరిగినా తాను ఖండిస్తానని చెప్పారు. ఎక్కడైనా ఏ మహిళపైనైనా దౌర్జన్యం జరిగినప్పుడు తాను పార్టీలకు అతీతంగా బాధితురాలి పక్షాన ఉంటానని ప్రియాంక స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆప్ చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. ఈ విషయం వారికే విడిచిపెడుతున్నానని ఆమె చెప్పారు.