హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ శాసనమండలి సభ్యుడు పి. కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్లు) సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 21 హాజరు కమ్మని తాఖీదు పంపింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కమిషన్ స్వయంచాలకంగా నోటీసు(సుమోటు నోటీసు) జారీచేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా ఆదేశించింది.
ఆయన చేసిన వ్యాఖ్య ప్రమాదకరమని, ఆమె గౌరవాన్ని కించపరిచేలా ఉందని మహిళా సంఘం తన అధికారిక కమ్యూనికేషన్‌లో పేర్కొంది. అతను హాజరుకాకపోతే, కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని ఫిబ్రవరి 14 నోటీసులో పేర్కొంది.
గవర్నరుకు పంపిన బిల్లులకు సమ్మతి తెలుపకపోవడం పట్ల గవర్నరుకు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె బిల్లులను తొక్కిపెట్టి ఉంచుతోందని పేర్కొన్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆయనపై జనవరి 28న పోలీసులకు ఫిర్యాదుచేసింది. గవర్నరుకు వ్యతిరేకంగా అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె సరూర్‌నగర్ పోలీసులను కోరింది.
కౌశిక్ రెడ్డి జనవరి 26న తెలుగులో గవర్నరుపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం మధ్య అభిప్రాయభేదాలు 2021లోనే తలెత్తాయి. సోషల్ సర్వీస్ కేటగిరి కింద శాసనమండలికి కౌశిక్ రెడ్డి పేరును క్యాబినెట్ ఆమోదించినప్పటికీ ఆమె ఆమోదించలేదు. ఎప్పుడైతే గవర్నర్ తాత్సారం చేశారో అప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డిని ఎంఎల్‌ఏ కోటా కింద ఎగువసభకు పంపింది.