మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారాలు పూర్తయి, మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక తదితర కీలకమైన నాలుగు శాఖలు తిరిగి పాత మంత్రులకే అప్పగించారు. అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, నితిన్ గడ్కరీ తిరిగి మంత్రివర్గంలో చేరారు. ఇక పరిపాలన ప్రారంభించడమే తరువాయి. అయితే గత 17వ లోక్‌సభలా ఇప్పటి 18 వ లోక్‌సభ లేదు. ‘కాంగ్రెస్ విముక్తి భారత్’ అన్న కాషాయనాథుల నినాదం ఈసారి పని చేయలేదు. కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుందని, ముస్లింలకే కట్టబెడుతుందనీ అన్న పాచిక కూడా పని చేయలేదు. దీనికి భిన్నంగా కాంగ్రెస్ స్వయంగా 99 సీట్లు గెలుచుకోవడం, ‘ఇండియా’ కూటమి మొత్తం సీట్ల సంఖ్య 234 కు చేరడం, ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో కూటమి బలం 236 కు చేరడం ఇవన్నీ మోడీ సంకీర్ణ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.
రాహుల్ ఎక్కడా విజయం సాధించలేరని సాక్షాత్తు మోడీయే ప్రచారం చేసినప్పటికీ రాహుల్ గాంధీయే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మోడీకి దీటుగా నిలబడ్డారు. గత పదేళ్ల కాలంలో ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల గొంతు వినిపించకుండా, చర్చకు అవకాశం ఇవ్వకుండా జబర్దస్తీగా వ్యవహరించి బుల్‌డోజ్‌లా దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో 17వ లోక్‌సభలో 179 బిల్లులు పాసయ్యాయి. వీటిలో 58% బిల్లులు ప్రవేశపెట్టిన రెండు వారాల్లోగా ఎన్‌డిఎ మందబలంతో ఆమోదం పొందగా, మరికొన్ని కేవలం గంటలోనే మొక్కుబడిగా చర్చించి తరువాత ఎలాగోలా ఆమోదం పొందేలా చేశారు. ఇదంతా బుల్‌డోజ్ జబర్దస్తీ తోనే విపక్షాల గొంతు వినిపించకుండా చేసినవేనన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి దూకుడు పని చేయదని సిపిఎం నాయకులు యేచూరి సీతారాం వంటి విపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు.
సభలో ఏకాభిప్రాయంతో ఆచితూచి ముందుకెళ్లక తప్పని గత్యంతరం ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, రైతుల సమస్యలు సవాలుగా ఉంటున్నాయి. వీటిని పరిష్కరించవలసి ఉంటుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను పీడిస్తున్న వ్యవసాయ సంక్షోభం కేంద్రం పరిష్కరించడం తక్షణ కర్తవ్యం. అందుకనే వ్యవసాయ రంగంలో అనుభవం సంపాదించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా కేంద్రం నియమించింది. చౌహాన్ మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించగలిగారు. కేంద్రం కీలకమైన శాఖలను తన పాత మంత్రులకే అప్పగించి సంకీర్ణంలో భాగస్వాములైన మిత్ర పక్షాలకు మొక్కుబడి శాఖలిచ్చి బుజ్జగించింది. మిత్ర పక్షాలు కూడా దీనికి కట్టుబడక తప్పడం లేదు. కేంద్ర పౌర విమానయాన శాఖను తెలుగుదేశం ఎంపి కింజరాపు రామ్మోహన్‌కు కేటాయించినా, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాన్ అవామీ , ఏక్‌నాథ్ షించే శివసేన వర్గాలకు చాలా స్వల్పమైన శాఖలతో సరిపెట్టడం గమనార్హం.
ఉదాహరణకు జనతాదళ్ (యునైటెడ్) ఏకైక ప్రతినిధి రాజీవ్ రంజన్ సింగ్‌కు పంచాయతీరాజ్, మత్సశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలను అప్పగించింది. వీటికన్నా ప్రాధాన్యమైన శాఖల కోసం మిత్ర పక్షాలు డిమాండ్ చేసే అర్హత ఉన్నప్పటికీ, తమ మీద ఉన్న ఒత్తిళ్ల కారణంగా ఈ పార్టీలన్నీ కేంద్ర సాయం కోసం ఆధారపడక తప్పడం లేదు. తెలుగు దేశం అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ఆంధ్రను ఆర్థిక అవసరాలు తీవ్రంగా ఉన్న దశలో స్వీకరిస్తున్నారు. ఇంతేకాకుండా ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి, పథకాల అమలుకు కేంద్రం ఆర్థిక చేయూత లేనిదే ఆయనేం చేయలేరు.
ఇక బీహార్ సిఎం నితీశ్ కుమార్ పరిస్థితి కూడా ఇంతే. బీహార్ రాష్ట్రం కూడా అనేక పథకాలకు ఆర్థిక సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మోడీ కూడా ఈ వాస్తవ మార్పును తోసివేయలేరు. కొత్త ప్రభుత్వం మనుగడ సాగించడానికి ఎప్పటికప్పుడు ఏకాభిప్రాయ సాధనే అత్యవసరమవుతుంది. నోట్ల రద్దు, వ్యవసాయ బిల్లుల అమలు కోసం అప్పుడు పార్లమెంట్‌లో అంతగా చర్చ సాగలేదు. యూనిఫారం సివిల్ కోడ్, లేదా వన్ నేషన్, వన్ ఎలక్షన్ వంటి వివాదాస్పద అంశాలు సులభంగా చర్చకు రాలేదు. ఇప్పుడు విపక్షాల బలం గట్టిగానే ఉంది. ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ఏ బిల్లుపైనా ఆమోదం సాధించాలంటే చర్చించి ఏకాభిప్రాయం సాధించడం కానీ లేదా స్థాయీ సంఘానికి పరిశీలనకు పంపించడం కానీ చేయక తప్పదు.