Sunday, December 22, 2024

డీలా లేదు మరింత బలమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష భేటీల మీద భేటీల నేపథ్యంలో బిజెపి తన బలప్రదర్శనకు దిగే యోచనలో పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ సారధ్యపు ఎన్‌డిఎ చెక్కుచెదరకుండా ఉందని తెలియచేసుకునే యత్నాల్లో పడ్డారు. ఇందులో భాగంగా త్వరలో ఓ సమయం చూసుకుని ఎన్‌డిఎ కీలక సమావేశం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీనిని అట్టహాసంగా నిర్వహించాలని, తమ బలం తగ్గలేదని చాటుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ఎన్‌డిఎ నుంచి ఉద్ధవ్ నాయకత్వపు శివసేన, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (యు) వైదొలిగాయి. దీనితో ప్రధాన భాగస్వామ్యపక్షం లేని రీతిలో నిజంగానే ఎన్‌డిఎ డీలా పడింది. అయితే పాత బలీయ మిత్రులు ఎన్‌డిఎకు దూరమైనా ఎటువంటి తేడా లేకుండా దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం అవుతోందని చాటుకునేందుకు కీలక భేటీ అవసరం అని భావిస్తున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే ఈ సమావేశం ఉండాలని సంకల్పించారు. దీనిపై ప్రధాని మోడీతో పార్టీ అధ్యక్షులు నడ్డా, వ్యూహకర్త అమిత్ షా మంతనాలు సాగిస్తున్నారు. పాత మిత్రులు వైదొలిగిన తరువాత వచ్చి చేరిన కొన్ని పార్టీల నేతలకు ఇప్పుడు జరగబోతున్న కేబినెట్ మార్పులలో చోటు దక్కే వీలుంది. బీహార్‌లోని ఆర్జేడీ జెడియూ వైరివర్గం బిజెపిని కలవరపరుస్తోంది. ఈ కూటమి బలోపేతం కావడం ఈ వేదిక నుంచే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఐక్యతల దిశలో అడుగులు పడటంతో ముందుగా అక్కడి ప్రాంతీయ పార్టీలను అవసరం అయితే అక్కడి మహాఘట్ బంధన్‌లోని కొన్ని పార్టీలను ఏదో విధంగా తమ వైపు మల్చుకోవాలని భావిస్తున్నారు. మహారాష్ఠ్రలోని షిండే నాయకత్వపు శివసేన బిజెపి వైపు తన మొగ్గుచూపుతూ , పనిలో పనిగా ఇతర పార్టీలను కూడా ఎన్‌డిఎలోకి తీసుకురాగలమని తెలియచేస్తోంది.

షిండే ఇటీవలే దేశ రాజధానిలో కొద్ది సేపు ఉండి బిజెపి నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎటువంటి చర్చలు జరిగాయనేది వెల్లడికాలేదు. అయితే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ గురించి ప్రధానంగా చర్చించినట్లు వెల్లడైంది. బీహార్‌కు సంబంధించి ఇటీవలే అధికారంలోని జెడియు నుంచి కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా , తరువాత మాజీ సిఎం జితన్ రామ్ మాంజీ వైదొలిగారు. ఆయన ఇటీవలే బీహార్ మంత్రివర్గం నుంచి ఆయన కుమారుడు వైదొలిగారు. జితన్ రామ్ ఢిల్లీలో బిజెపి అధ్యక్షులు నడ్డాను కలిశారు. అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఇక ఎల్‌జెపి నేత చిరాగ్ పాశ్వాన్ కూడా బిజెపి వైపు చూస్తున్నారు.

దీనిని ఇప్పుడు తమకు అనుకూలంగా మల్చుకుని తీరాలని బిజెపి పావులు కదిపింది. రెండు మూడురోజులలో మంత్రి మండలి మార్పులు, పార్టీ సంస్థాగత ప్రక్షాళనపై బిజెపి దృష్టి సారించనుంది. మరో వైపు ప్రతిపక్ష ఐక్యతకు సవాలుగా తాము సంఘటితం అని తెలియచేసుకుంటూ ఎన్‌డిఎ బలప్రదర్శన జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News