Wednesday, January 22, 2025

పాఠాలు ప్రతిపక్షాలకూ ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల పాఠాలు బిజెపికి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలపై జరుగుతున్న చర్చలన్నీ అధికార పక్షం మెజారిటీ కోల్పోవడం గురించే సాగుతున్నాయి. బిజెపికి, ఎన్‌డిఎకు పోయిన సారి కన్నా సీట్లు తగ్గాయని, వారు చార్ సౌ పార్ అన్న లక్షం అసలే నెరవేరలేదని ఎత్తి చూపుతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా, రామాలయ నిర్మాణం జరిగిన దరిమిలా అయోధ్య పట్టణం గల ఫైజాబాద్‌లోనే బిజెపి ఓడిందని, అయోధ్య రెవెన్యూ డివిజన్‌లో అయిదు స్థానాలుండగా మొత్తం అన్నింటినీ కోల్పోయిందని, స్వయంగా ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసిలో ఆయన ఆధిక్యత సగానికి పైగా తగ్గి కేవలం లక్ష చిల్లరకు తగ్గిందని విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చాలా గమనించదగ్గ విషయాలనడంలో సందేహం లేదు. వీటిలో కనీసం ఒక్క విమర్శకైనా బిజెపి జవాబు చెప్పలేకపోతున్నది.

ఈ విమర్శలలో గల వివిధ అంశాల నుంచి అధికార పక్షం నేర్చుకోవలసిన పాఠాలు తప్పకుండా ఉన్నాయి. అట్లాగే, తాము వరుసగా మూడోసారి అధికారానికి రాలేకపోయినా, కాంగ్రెస్ సీట్లు 100కు చేరకపోయినా ప్రతిపక్షాలు ఇంతగా ఉత్సాహం చూపడం అర్థం చేసుకోదగినదే. అందుకు గల కారణం వారు అనూహ్యమైన రీతిలో బిజెపికి, అందులోనూ మోడీకి పగ్గాలు వేయగలగడం. దీనితో వారికి గత పదేళ్ళుగా లేని ఉత్సాహం వచ్చింది. ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగింది. ఇదంతా ఇటీవలి పార్లమెంటు సమావేశాలలో ప్రతిఫలించింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కాని, ఎన్నికల ఫలితాలను బట్టి నేర్చుకోవలసిన పాఠాలు బిజెపికి మాత్రమే ఉన్నాయా? ఎంత మాత్రం కాదని జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. బిజెపికి మాత్రమే ఉన్నట్లు ప్రతిపక్షాలు భావిస్తే పెద్ద పొరపాటు కాగలదు. ఇంకా విశేషమేమంటే, ఓటమి నుంచి బిజెపి, గెలుపు నుంచి ప్రతిపక్షాలు రెండు కూడా నేర్చుకోవలసిన పాఠాలు ఒకే విధమైనవి. ఇట్లా అనడం ఆశ్చర్యంగా తోచవచ్చు. కాని చర్చల్లోకి వెళితే ఆ మాట నిజమని బోధపడుతుంది.

ముందుగా కొన్ని ప్రశ్నలు వేసుకుని ఈ చర్చ మొదలుపెడదాము. పైన ప్రస్తావించిన విధంగా బిజెపి తన మెజారిటీ ఎందుకు కోల్పోయింది? అంతకు ముందు రెండు సార్లు మెజారిటీ ఎందుకు సంపాదించింది? తర్వాత ఇప్పుడు ఎందుకు తగ్గింది? అయోధ్య సీట్లను రెండు సార్లు ఎందుకు గెలిచింది? ఈ సారి ఎందుకు ఓడింది? మోడీ మెజారిటీ 2014 కన్న 2019లో అప్పటి కన్న ఈ 2024 లో ఎందుకు తగ్గుతూ వచ్చింది? అనేవి ఒక విధమైన ప్రశ్నలు. అయితే, సరిగా ఇవే ప్రశ్నలను వెనుకకు తిప్పి కాంగ్రెస్‌కు, ప్రతిపక్షాలకు వేయవచ్చు.

వేయాలి కూడా. ఎట్లానో చూద్దాము. కాంగ్రెస్, ప్రతిపక్షాలు కొన్ని దశాబ్దాల పాటు ఎదురు లేకుండా పరిపాలించిన తర్వాత, బిజెపికి 2014లో, 2019లో మెజారిటీ ఎట్లా వచ్చినట్లు? ఈ పార్టీలు చిత్తుగా ఎందుకు ఓడినట్లు? అయోధ్యలోనూ అదే స్థితి ఎందుకున్నట్లు? బాబ్రీ మసీదును కూల్చిన 1992 దరిమిలా కూడా అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానాన్ని ఓడిన బిజెపి ఆ తర్వాత వరుసగా రెండు సార్లు గెలవగా ప్రతిపక్షాలు ఎందుకు కోల్పోయినట్లు? మరి కొంత వెనుకకు వెళితే, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉత్తరప్రదేశ్‌ను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన తర్వాత, ఎస్‌పి, బిఎస్‌పి వంటి స్థానిక పార్టీలకు ఎందుకు కోల్పోయినట్లు? తన బలం దాదాపు శూన్యస్థితికి ఎందువల్ల పతనమైనట్లు? మొన్నటి ఎన్నికలలోనూ ఎస్‌పి మద్దతుతో తప్ప, గెలవలేని స్థితి ఎందుకు ఏర్పడినట్లు? స్వయంగా రాహుల్ గాంధీ తమ కుటుంబ నియోజక వర్గమైన రాయ్‌బరేలీలో 2019 లో ఎందుకు ఓడినట్లు? ఈసారి ఎస్‌పి మద్దతుతో గాని గెలవలేని స్థితి ఎందువల్ల ఏర్పడినట్లు? వీరందరిలో ఎవరైనా సమాధానాలు చెప్పగలరా?

ఈ రకరకాల ప్రశ్నలు అన్నీ ఒక వైపు బిజెపికి, మరొక వైపు కాంగ్రెస్, ప్రతిపక్షాలకూ ఉన్నాయి. వారికేనని వీరు గాని, వీరికేనని వారు గాని సంతోషించవలసిందేమీ లేదు. అట్లా ఎందుకన్నది ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే, దేశానికి స్వాతంత్య్రం లభించిన 75 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వీరందరూ దేశాన్ని, ఉత్తరప్రదేశ్‌ను, వివిధ రాష్ట్రాలను జనరంజకంగా పాలించడంలో విఫలమవుతూ వస్తున్నారు గనుకనే ప్రజలు అందరినీ గెలవటం, ఓడటం అనే రంగుల రాట్నంలో చుట్టూ తిప్పుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో అట్లా చేయడం మినహా ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు కదా. ఉండినట్లయితే ఉభయులను ఆ రంగుల రాట్నం నుంచి బయటకు తోసివేసి ఉండేవారు. సమస్య ఎక్కడ వస్తున్నదంటే, ఇటువంటి ఎదురు దెబ్బలు ఎవరికి ఎన్నిసార్లు తగులుతున్నా, ప్రజలు అటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారన్నది ఆలోచించి పాఠాలు నేర్చుకోవటం లేదు. అవసరమైన మార్పులు చేసుకోవటం లేదు. ఓడినప్పుడల్లా ఆ పాఠాలు ఎదుటి వారికేనని వాదించి ఆత్మవంచన చేసుకుంటారు.

విషయమేమంటే, ఒక వేళ తాము గెలిచినా ఆ గెలుపులోనూ తమకు పాఠాలుంటాయి. ప్రజలు ఎందుకు ఎదుటి పక్షాన్ని ఓడించి, ఎందుకు తమను గెలిపించారని ఆలోచించినట్లయితే మునుముందు కూడా అట్లాగే గెలిపించే విధంగా ప్రజలను తమ పాలన ద్వారా మెప్పించేందుకు కృషి చేస్తారు. కాని అటువంటి పాఠాలు ఎవరూ నేర్వడం లేదు. గతంలో లేదు. మొన్నటి ఎన్నికల తర్వాత కూడా లేదు. అది తమ ఘనత అని పొంగిపోవడం తప్ప. వాస్తవానికి బిజెపి మెజారిటీ కోల్పోవడం గాని, ‘ఇండియా’ కూటమి బలం పెరగడం గాని కేవలం ప్రజల ఘనత. ఇది ఇరుపక్షాలు గ్రహించవలసిన విషయం.
ప్రస్తుతం మేఘాలలో తేలిపోతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సత్వరం నేర్చుకోవలసిన పాఠాలు కొన్నున్నాయి. తమ ఇంత కాలపు వైఫల్యాలకు ప్రజలు ఎందువల్ల శిక్షించారో నిజాయితీతో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ వైఫల్యాలకు విధానాలపరంగా, ఆచరణపరంగా, నీతి నిజాయితీల పరంగా, సంస్థాగత బలహీనతలను బట్టి ఎటువంటి మార్పులు చేసుకుంటే తప్ప ప్రజల ఆదరణ నిజమైన విధంగా, పూర్తి స్థాయిలో లభించదో తెలుసుకోవాలి. అటువంటి కార్యాచరణలకు పూనుకుంటే తప్ప మొన్నటి కొద్దిపాటి విజయాలు తాత్కాలికం మాత్రమే కాగలవని అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో, మొన్నటి ఎదురు దెబ్బలతో బిజెపి తన దిద్దుబాట్లు తాను చేసుకుని తిరిగి బలపడగలదు. ఇవన్నీ ప్రతిపక్షాలకు గల పాఠాలు.

వీటి వివరాలలోకి వెళితే ఇంకా అనేకం కనిపిస్తాయి. వాటిలో అన్నింటి కన్న కీలకమైన దానిని చూద్దాము. ఆర్థిక సంస్కరణలను విచక్షణా రహితంగా అమలు చేయడంలో కాంగ్రెస్, బిజెపిలు ఒక దానికొకటి తీసిపోవు. భారత రాజ్యాంగం సూచించిన సమతులనమైన అభివృద్ధి, సంక్షేమాలను ఇరువురూ విస్మరించారు. వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య అభివృద్ధి అసమానతలు ఇరువురి పాలనలోనూ తలెత్తి కొనసాగాయి. అందువల్లనే ప్రజలలో అసంతృప్తులు పెచ్చరిల్లుతూ వారు రంగుల రాట్నం రాజకీయంలో ఉభయులనూ దఫదఫాలుగా ఓడిస్తున్నారు. కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌నే ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ బిజెపి మత ప్రచారపు హోరులో రెండు సార్లు గెలిచినప్పటికీ, ఈసారి రామ మందిర నిర్మాణం జరిగినాక కూడా ఓడడానికి కారణం ఇదే. సరిగా ఇదే సూత్రం కాంగ్రెస్‌కు సైతం వర్తిస్తుంది.

అభివృద్ధి, సంక్షేమ వైఫల్యాల వల్ల అక్కడ కాంగ్రెస్ ఓడటం 1960ల చివరనే మొదలు కాగా, రంగుల రాట్నంలో పడిలేచి తిరుగుతూ, గత పాతిక ముప్పయి సంవత్సరాలుగా అధమ స్థాయికి చేరి అక్కడే ఆగిపోయింది. ఈసారి ప్రాణం పోసుకోవడం స్థానిక పార్టీల చలవ వల్ల మాత్రమే. సమస్య ఏమంటే, రాహుల్ గాంధీ రకరకాల హడావుడులు చాలానే చేస్తున్నారుగాని, కీలకమైన ఈ ఆర్థిక విధానాల గురించి ఏమీ మాట్లాడటం లేదు. బిజెపిని అదానీ, అంబానీలతో ముడిపెట్టి దాడి చేయడం వినేందుకు బాగానే ఉంటుంది. కాని అదే ఆర్థిక విధానం కాదు.

ఆ మాటకు వస్తే, బిజెపి రాకతో అదానీ సామ్రాజ్యం విస్తరించిన మాట నిజమే గాని, అంతకు ముందు అంబానీల సామ్రాజ్యం ఎదిగింది కాంగ్రెస్ హయాంలో కాదా? అందుకు కావలసిన కిటుకులన్నింటిని అమలు పరచింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం మోడీకి ఆర్థిక దన్ను అదానీ, అంబానీలు కాగా, లోగడ గాంధీ కుటుంబానికి దన్నులు అంబానీలు. అందుకు బదులుగా ఈ సూపర్ ధనికులలో ఎవరి పొందిన రాయితీలు ఏమిటో కొన్ని అధ్యయనాలు కూడా వెలువడ్డాయి. అంతిమ విశ్లేషణలో, రెండు పార్టీల ఈ విధమైన చర్యల వల్ల ప్రజలకు వేర్వేరు రూపాలలో నష్టాలు జరుగుతూనే వస్తున్నాయి. ఇటువంటి తీరులో వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్‌కు తీసిపోలేదు. మరి ఈ విధమైన పాఠాలను కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి నేర్చుకుంటాయా?లేక రంగుల రాట్నంలో ఇంత కాలంవలే తిరుగుతూనే ఉండదలచుకుంటాయా?

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News