Friday, November 22, 2024

బల ప్రదర్శన..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్‌డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్‌డిఎ మంగళవారం ఎన్‌డిఎ మెగా మీట్‌ను ఏర్పాటు చేయగా, అదే సమయంలో అంటే సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ బెంగళూరులో సమావేశం కానున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశానికి దాదాపు 30 పార్టీలు హాజరు కానుండగా, కాంగ్రెస్ నేతృత్వంలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి 26 ప్రధాన పార్టీలు హాజరు కానున్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటాయని భావిస్తూ వచ్చిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశాలకు వెళ్తామని ప్రకటించడంతో బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసే దిశగా మరో ముందడుగు పడినట్లయింది.

మరో వైపు బిజెపి కూడా ఇటీవలి కాలంలో దూరమైన పాతమిత్రులను తిరిగి దగ్గర చేసుకోవడం ద్వారా ఎన్‌డిఎ కూటమిని మరింత బలోపేతం చేసుకోవడానికిప్రయత్నాలు చేస్తూ ఉంది,. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన నలుగురు నేతలు లోక్‌జనశక్తి పార్టీ(రాంవిలాస్)కు చెందిన చిరాగ్ పాశ్వాన్, హిందుస్థానీ అవామీ మోర్చాకు చెందిన జితన్ రామ్ మంఝి, రాష్ట్రీయ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర సింగ్ కుష్వాహా, వికాస్ శీల్ ఇనాన్ పార్టీకి చెందిన ముకేశ్ సహానీలకు ఎన్‌డిఎ సమావేశం కోసం ఆహ్వానాలు పంపడం, వారు అంగీకరించడంతో వారంతా తిరిగి ఎన్‌డిఎ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఒకప్పుడు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితుడుగా ఉన్న సుఖ్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీనేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కూడా తాను తిరిగి ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఆదివారం ప్రకటించడంతో దాని బలం మరింత పెరిగింది. అయితే ఒకప్పుడు బిజెపి మిత్రపక్షాలుగా ఉండిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, బాదల్ కుటుంబం చేతుల్లో ఉన్న శిరోమణి అకాలీదళ్ మాత్రం ఎన్‌డిఎ కూటమికి దూరంగానే ఉండనున్నాయి.

ఈ రెండు పార్టీలు కూడా తిరిగి ఎన్‌డిఎలో చేరుతాయనంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి బిజెపి వాటిని దూరంగానే ఉంచింది. ప్రస్తుతం ఎన్‌డిఎ కూటమిలో బిజెపి, అన్నా డిఎంకె, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం)తో పాటుగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని 24 పారీ ్టఉన్నాయి. తాజాగా ఎన్‌సిపి( అజిత్ పవార్ వర్గం)తో సహా ఆరు పార్టీలు కూటమిలో చేరుతుండడంతో ప్రతిపక్షాలకు దీటుగా ఎన్‌డిఎ కూటమి కూడా బలోపేతం అవుతోందని చెప్పుకోడానికి బిజెపికి అవకాశం లభించినట్లవుతోంది.మరో వైపు ప్రతిపక్షాల కూటమికి కూడా ఊహించని విధంగా రెండు ప్రధాన పార్టీల మద్దతు లభించింది. ఢిల్ల్లీ అధికారుల నియామకానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ప్రకటించని పక్షంలో భవిష్యత్తులో జరిగే అన్ని విపక్షాల భేటీకి తామె హాజరు కాబోమని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఇన్ని రోజులుగా ఈ విషయంపై తన వైఖరిని తెలియజేయని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నామని, రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించడంతో బెంగళూరు భేటీకి హాజరవుతామని ఆప్‌కూడా ప్రకటించింది. అదే విధంగా బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మమతాబెనర్జీ సైతం సోనియాగాంధీ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మెత్తబడి ఈ సమావేశానికి హాజరవుతుండడంతో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్లయింది. పాట్నాలో గత నెల 23న నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశానికి 15 పార్టీలు హాజరు కాగా, బెంగళూరు సమావేశానికి 26 పార్టీలు హాజరవుతాయని భావిస్తున్నట్లు విపక్ష నేత ఒకరు చెప్పారు.

కాగా బెంగళూరు సమావేశంలో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిస్తారని తెలుస్తోంది. బెంగళూరులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశం చాలా నిర్ణయాత్మకమైనదని, బోలెడన్ని అంశాలను ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని శివసేన (ఏక్‌నాథ్ షిండే) నేత సంజయ్ రౌత్ చెప్పడం గమనార్హం. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్ష నేతలకు ఇచ్చే విందుసమావేశంతో ఈ సమావేశాలు మొదలవుతాయి. రెండో రోజుకీలక అంశాలపై చర్చలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News