Tuesday, November 26, 2024

ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

Corona again in india పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వొక ముఖ్యమైన ఘట్టం పూర్తి అయింది. పాలక, ప్రతిపక్షాలు రెండూ ఒకేసారి తమ అభ్యర్థులను ప్రకటించాయి. పాలక పక్షం బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) తన తరపున ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును ప్రకటించింది. ప్రతిపక్షం అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. ప్రస్తుతం ఎన్‌డిఎకి ప్రతిపక్షం కంటే స్వల్పంగా తక్కువ వోట్లున్నాయి. బిజూ జనతాదళ్, వైఎస్‌ఆర్‌సిపిల ఓట్లతో ఆ చిన్న తేడాను పూరించుకొని తన అభ్యర్థిని గెలిపించుకొనే అవకాశం అధికార కూటమికి ఉంది. కాని ప్రతిపక్షం దుర్భేద్యమైన ఐక్యతను సాధించుకొని పాలకపక్ష ఓట్లను చీల్చగలిగితే తన అభ్యర్థిని గెలిపించుకొనే అవకాశం దానికి లేకపోలేదు. అయితే చెల్లాచెదురై ఉన్న ప్రతిపక్షం అటువంటి అద్భుతాన్ని సాధిస్తుందని గట్టిగా అనుకోగల పరిస్థితి కనిపించడం లేదు. అంతమాత్రం చేత పోటీ చేయకుండా చేతులు ముడుచుకొని కూచోడం ప్రజాస్వామిక చైతన్యానికే సిగ్గు చేటు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బిజెపిని గట్టిగా ఢీ కొనడమే ప్రతిపక్ష శిబిరం కర్తవ్యం. రాష్ట్రపతి యెన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని అసెంబ్లీల సభ్యులు వోటు హక్కు కలిగి వుంటారు. పార్లమెంటు సభ్యుల వోటు విలువ స్థిరంగా ఉంటుంది. యెప్పుడూ మారదు. దాని విలువ 708. అసెంబ్లీ సభ్యుల వోటు విలువ ఆయా రాష్ట్రాల జన సంఖ్య, శాసన సభ్యుల సంఖ్యను బట్టి వుంటుంది. అతి పెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుని వోటు విలువ అత్యధికంగా 208. మొత్తం 403 మంది యుపి ఎమ్‌ఎల్‌ఎ ల వోటు విలువ 83824. మొత్తం ఎంపిలు 776 మంది వీరిందరి ఉమ్మడి ఓటు విలువ 56640. ఆ పద్ధతిలో మొత్తం 4,809 ఎలెక్టోరల్ వోట్ల విలువ 10,86,431గా నిర్ధారణ అయ్యింది.

ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల యెన్నికల తర్వాత బిజెపి ఎమ్‌ఎల్‌ఎల సంఖ్య తగ్గింది. ఈ యెన్నికలకు ముందు మొత్తం ఎన్‌డిఎ వోట్ల విలువ, మెజారిటీకి 0.05 శాతం తక్కువ ఉండగా, ఇప్పుడు అది 1.2 శాతానికి పెరిగింది. అంటే 13000 వోట్ల లోటులో వుంది. ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవాలంటే ప్రతిపక్ష చీలిక అనివార్యమవుతున్నది. వైఎస్‌ఆర్‌పి, బిజూజనతాదళ్ వంటి పార్టీల మద్దతు తప్పనిసరి అవుతున్నది. అయితే ఆ రెండు పార్టీల నుంచే కాకుండా ఇతరత్రా వీలున్న అన్ని చోట్ల నుంచీ వోట్లను సంపాదించుకొనే యుక్తి, శక్తి బిజెపికి వున్నాయి. ఈ విషయంలో దానికి నైతిక పరిధులంటూ లేవు. అందుచేత రాష్ట్రపతి పదవికి తన అభ్యర్థిని గెలిపించుకోడంలో అది విఫలం కావడం అసంభవం. కేంద్రంలో తనకు గల ఎదురులేని అధికారంతో దానికి సాధ్యం కానిది వుండదు.

ఎన్‌డిఎలో అసమ్మతి నేత, బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్(యు) అధినేత నితీశ్ కుమార్ కోణం ఈ సమయంలో దానికి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలు ఎంత వరకు వుంటాయో గట్టిగా చెప్పలేము. ఆయనపై ఆశలతోనే యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షం బరిలో నిలబెట్టింది.బిజెపి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశాకు చెందిన సంథాల్ తెగ ఆదివాసీ కావడం పాలక పక్షానికి కలిసొచ్చే అంశం. ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్‌గా చేసిన విశేష అనుభవాన్ని కలిగి వున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్ తర్వాత రైసానా హిల్స్ లో అడుగుపెట్టబోతున్న రెండవ మహిళ. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికలో వరుసగా సామాజిక న్యాయానికి ప్రాధాన్యం యిస్తున్నదనే మెప్పును ఈ ఎంపిక ద్వారా బిజెపి కొట్టేసింది. ద్రౌపది ముర్ము ఎంపిక ద్వారా ఒడిశా, బీహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల ఆదివాసీల వోటును ఆకట్టుకొనే అవకాశాన్ని బిజెపి కల్పించుకొన్నది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదార్లకు మన గిరిజన ప్రాంతాల్లోని విలువైన గనులను కట్టబెట్టే మార్గంలో అడ్డంకులను కొంత మేరకైనా తొలగించడంలో యిది ఉపయోగపడవచ్చు. అభ్యర్థిని ఎంపిక చేయడంలో ప్రతిపక్ష శిబిరానికి చాలా యిబ్బందులు యెదురయ్యాయి. మరాఠా నేత శరద్ పవార్ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాగలడని ముందుగా వార్తలు వచ్చాయి.

కాని ఆయన అందుకు నిరాకరించారు. ఆ తర్వాత ఫారుక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పేర్లు వినిపించాయి. చివరికి యశ్వంత్ సిన్హా పేరు ఖరారయింది. ప్రతిపక్షం విజయం సాధిస్తుందన్న దృఢ విశ్వాసమే వుండి వుంటే అభ్యర్థి కావడానికి పవార్ గాని, ఇతరులు ఇద్దరు కాని నిరాకరించి ఉండేవారు కాదు. ఉత్సవ విగ్రహాలుగా పోటీలో ఉండడానికి వారు ఇష్టపడ లేదు. ఎంపిక చేసిన యశ్వంత్ సిన్హా కూడా బిజెపి మూలాలున్నవారు. అందువల్ల బిజెపి వోట్లలో చీలిక వచ్చి ఆయనకు ప్రయోజనం కలుగుతుందని అనుకోలేము. అయితే పదహారవ రాష్ట్రపతి పదవి యెన్నిక ప్రతిపక్ష శ్రేణుల మధ్య ఐక్యతను పటిష్ఠం చేస్తుందని, అంతిమంగా బిజెపిని దేశాధికార పీఠం నుంచి దించడంలో ఉపయోగపడుతుందని ఆశించాలి. ఊహించని మలుపులు తిరిగి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతుందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News