పాట్నా : నితీశ్, లాలూలది జలం తైలం బంధం అని, ఇది కలిసి ఉండేది కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బీహార్‌లోని మధుబని జిల్లాలో శనివారం జరిగిన సభలో అమిత్ షా మాట్లాడారు. జెడియూ ఆర్జేడీలు బీహార్‌లో ఎంతకాలం కలిసికట్టుగా పనిచేస్తాయనేది ఎవరికి అంతుపట్టని విషయం అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలలోనూ ఎన్‌డిఎకే దక్కుతాయని స్పష్టం చేశారు.
ఎన్నికల కోసమే ఇండియా బ్రాండ్ పేరిట ప్రతిపక్షం కూటమి ఏర్పడిందని చెప్పిన అమిత్ షా వారి పాత కూటమి యుపిఎ తరఫున ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేదన్నారు. ఇండియా కూటమికి బీహార్‌లో తిరిగి జంగిల్ రాజ్ తీసుకువచ్చే సమర్థత దండిగా ఉందన్నారు. ఇంతకు ముందు ప్రతిపక్షాలు యుపిఎ పేరిట పనిచేశాయి. ఇందులోని వివిధ పార్టీల నేతలు రూ 12 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని , దీనితో పాత కూటమిని పక్కకు పెట్టి కొత్త ముసుగుతో బయటకు వచ్చారని , అయితే ఆయిల్ వాటర్ కలిసి ఉంటాయా? అని నిలదీశారు.