గోవా నుంచి తీసుకుని వస్తున్న నాన్‌డ్యూటీ పేయిడ్ మద్యాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. మద్యం తీసుకుని వస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రూ.12లక్షల విలువైన 415 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం ప్రోత్సాహ కార్యక్రమంలో భాగంగా 90మంది వ్యాపారులను కంపెనీ గోవా టూర్‌కు తీసుకుని వెళ్లింది. అక్కడికి వెళ్లిన వ్యాపారులు జగిత్యాలకు చెందిన పల్లెపు వెంకటేష్, గుండాల శ్రవణ్, శ్రీరాం, కరీంనగర్‌కు చెందిన మెట్టపల్లి రామకృష్ణా, సిద్దిపేటకు చెందిన చల్లారపు రాజి రెడ్డి, నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన రఘుగౌడ్, మంచిర్యాలకు చెందిన కె. హరీష్ యాదవ్ తిరిగి వచ్చే సమయంలో అక్కడి ఖరీదైన మద్యం కొనుగోలు చేసి తీసుకుని బయలుదేరారు.
ఈ విషయం హైదరాబాద్ ఎక్సైజ్ సిబ్బందికి తెలియడంతో వారు వస్తున్న మూడు విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎదురు చూశారు. బయటికి వచ్చిన తర్వాత వారి వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి వద్ద మూడు మద్యం బాటిళ్ల నుంచి 30 వరకు తీసుకు వస్తున్న వారిని ఆపి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి మద్యం తీసుకు రావడానికి అనుమతి ఉండదు. గోవా నుంచి తెలంగాణకు ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకవచ్చిన నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌గా గుర్తించి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో ఎస్‌టిఎఫ్ సీఐ సుబాష్ చందర్‌రావు,చంద్రశేఖర్, డిటిఎఫ్ సిఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సిఐ దేవేందర్‌రావు, ఎస్సైలు, సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
చండీగర్ మద్యం…
చండీగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వస్తున్న నాన్‌డ్యూటీ పేయిడ్ మద్యాన్ని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అత్తాపూర్‌కు చెందిన గోపాల్ అగర్వాల్ చండీగర్ నుంచి హైదారాబాద్‌కు ఒక వాహనంలో మద్యాన్ని తీసుక వచ్చాడు. ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని మెట్రో స్టేషన్ సమీపంలో మరో వాహనంలోకి మద్యం బాటిళ్లను మార్చుతుండగా ముషీరాబాద్ ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం రావడంతో పట్టుకున్నారు. రూ.3.85లక్షల విలువైన 72మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు చండీగర్‌లో కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నిందితుడు చెప్పాడు. మద్యం బాటిళ్లను చండీగర్‌లో రూ.1.32 వేలకు కొనుగోలు చేశానని హైదారాబాద్‌లో విక్రయిస్తే రూ.4 లక్షలు వస్తాయని నిందితుడు విచారణలో తెలిపాడు.