భువనేశ్వర్ : శుక్రవారం రాత్రి నాటి ఒడిషా రైలు దుర్ఘటన గురించి తొట్టతొలిగా అధికారులకు తెలిపి అలర్ట్ చేసిన వ్యక్తి జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) జవాను అని వెల్లడైంది. సెలవుపై ఉన్న ఈ 39 ఏండ్ల జవాను ఎన్‌కె వెంకటేశ్ ఇదే రైలులో ప్రమాదం దశలో చెన్నైకు వెళ్లుతున్నాడు. కోల్‌కతాలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ సెకండ్ బెటాలియన్‌లో పనిచేసే ఈ జవాను రైలులోని బి 7థర్డ్ ఎసి కోచ్‌లో సీటు నెంబరు 58లో ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. తాను ప్రయాణిస్తున్న కోచ్ పట్టాలు తప్పి ఉన్న ఇతర బోగీలకు తాకకుండా దూరంగా ఒరిగిపోయిందని,
దీనితో తాను తనతో పాటు ఇతరులం క్షేమంగా బయటకు వచ్చామని వెంకటేశ్ తెలిపారు. వెంటనే ఆయన తన దళానికి చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు ప్రమాదం గురించి తెలిపి అలర్ట్ చేశాడు. పైగా ఘటనాస్థలిలో ఉండి తన సెల్‌ఫోన్ ద్వారా అక్కడి దృశ్యాలను వాట్సాప్ నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ కంట్రోలురూంకు పంపించారు. దీనితో ఈ ప్రాంతానికి హుటాహుటిన సహాయక బృందాలను ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు పంపించగలిగారని వెల్లడైంది. ఒక్కసారి భారీ కుదుపు ఏర్పడింది. పలువురు ప్రయాణికులు కిందపడ్డారు. ఒకరిద్దరు ప్రయాణికులను తాను ముందు రక్షించి సమీపంలోకి తీసుకువెళ్లి , సాధ్యమైనంత వరకూ పలువురిని కాపాడేందుకు యత్నించానని వెంకటేశ్ చెన్నైకు బయలుదేరిన రిలీఫ్ రైలులో నుంచి వార్తాసంస్థలకు తెలిపారు.