వానలు తగ్గినా ఇంకా నీటిలోనే జనావాసాలు
అల్పపీడనం వల్ల కురిసిన భారీ వర్షాలు, బలహీనపడిన అల్పపీడనం, హన్మకొండ జిల్లా నడికూడలో 38.8సెం.మీ. వర్షం
రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8సెం.మీ. వర్షపాతం నమోదు, ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారికి ముంపు
సిరిసిల్ల జిల్లాలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు
216 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలింపు, 500 మందిని రక్షించిన రెస్య్యూ టీం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నగరాలు, పట్టణాలు, పల్లెలు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్లను వరద బురద ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గతంలో ఎన్నడూ లేనంతగా చాలా జిల్లాలో వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. హన్మకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటిమీటర్ల వర్షం కురవగా, రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో తెలంగాణ, మహరాష్ట్రల సరిహద్దుల్లో ఉన్న కందుకుర్తి బ్రిడ్జిపై నుంచి వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద 163వ జాతీయ రహదారి నీట మునగడంతో తెలంగాణ టు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తడంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాతా ఆలయం జలదిగ్భందంలోకి వెళ్లింది. ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు.
లక్షల ఎకరాల్లో పంటలు
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు నీటమునిగాయి.
ధ్వంసమైన రహదారులు, రోడ్లపై ఇసుక మేటలు
భారీ వర్షాలతో జలదిగ్భంధమైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలు మెల్లగా తేరుకుంటున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. నీరు లేనప్పటికీ వరద తెచ్చిన బురద, ధ్వంసమైన రహదారులు, రోడ్లపై ఇసుక మేటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన కూడళ్ల వద్ద చెత్త కుప్పలుతెప్పలుగా
రాజన్న సిరిసిల్ల జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో సిరిసిల్ల పట్టణం జలమయం అయ్యింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కుప్పలు తెప్పలుగా చెత్త జలదిగ్బంధం నుంచి తేరుకుంటున్న సిరిసిల్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బుధవారం నాటికి వెంకంపేట, పాత బస్టాండ్, అంబిక నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. పట్టణంలోని శాంతినగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో వరద తగ్గడంతో రోడ్లన్నీ బురదగా మారాయి.
పలు చోట్ల కొనసాగుతున్న వరద
సిరిసిల్లలో 216 కుటుంబాలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రానికి తరలించాయి. సిరిసిల్ల- టు కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన భవన నిర్మాణ మేస్త్రీ పెరుమాండ్ల దేవయ్య (55) మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతయ్యాడు. వర్షాల కారణంగా మంగళవారం ఇంట్లోనే ఉన్న దేవయ్య సాయంత్రం వర్షం తగ్గడంతో కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ బయలుదేరాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు దేవయ్య మృతదేహాన్ని బుధవారం ఉదయం నాలా నుంచి 50మీటర్ల దూరంలో కనుగొన్నారు.
500 మందిని రక్షించిన రెస్క్యూ టీం
వరంగల్‌లో 20 కాలనీలు నీట మునగ్గా 500 మందిని రెస్క్యూ టీం రక్షించింది. కరీంనగర్‌లోని 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరంగల్- కరీంనగర్ హైవే, వరంగల్- టు ములుగు హైవేపై కటాక్షపూర్ చెరువు వద్ద వరద పోటెత్తింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి- కరీంనగర్ రూట్‌లో కమాన్‌పూర్ వద్ద నిర్మాణంలో ఉన్న మెయిన్‌రోడ్ కొట్టుకుపోయింది. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగడంతో రహదారి తెగిపోయింది.
146 కుటుంబాలకు అధికారుల పునరావాసం
సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, నిజామాబాద్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పలు చోట్ల కార్లు, బైక్‌లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని వాగు ఉప్పొంగడంతో అవతలి ఒడ్డున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, దుమ్మగూడెంలో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పెద్దచెరువు, జంగమయ్య కుంట, శుద్ధికుంట, కొత్త చెరువులు సిరిసిల్ల జలదిగ్బంధమైంది. పట్టణంలోని 25 కాలనీలు నీటమునగడంతో 146 కుటుంబాలకు అధికారులు పునరావాసం కల్పించారు.
తీవ్ర అల్పపీడనం బలహీనపడింది
మంగళవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం బలహీనపడిందని అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 11వ తేదీన ఉత్తర మధ్య బంగాళాఖాతం దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
NDRF team rescue people from floods in Sircilla