మహారాష్ట్రలో ధార్మిక కార్యక్రమంలో ఘటన
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆహారం తిన్న తర్వాత దాదాపు 2,000 మంది అస్వస్థతకు గురయ్యారని బుధవారం ఒక అధికారి తెలిపారు. లోహా తహసిల్ పరిధిలోని కోష్ట్‌వాడి గ్రామంలో మంగళవారం ఒక ధార్మిక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమీపంలోని సవర్‌గావ్, పోస్ట్‌వాడి, రిసన్‌గావ్, మస్కి గ్రామాలకు చెందిన గ్రామస్తులు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వారంతా అక్కడ ఆహారం తిన్నారు.
బుధవారం ఉదయం వీరంతా వాంతులు, విరేచనాలతో బాఢపడ్డారని ఆ అధికారి చెప్పారు. ప్రాథమికంగా ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 150 మంది నాందేడ్‌లోని ఉప జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన చెప్పారు. అయితే క్రమగా బాధితుల సంఖ్య పెరగడంతో 870 మందిని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాలతో సహా వివిధ ఆసుపత్రులలో చేర్పించినట్లు ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా నాందేడ్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో కూడా అదనపు పడకలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
రోగుల శాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం సేకరించినట్లు అ అధికారి చెప్పారు. బాధిత గ్రామాలలో సర్వే చేసేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విషాహారం ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. కోలుకున్న రోగులను ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు.