Monday, December 23, 2024

పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన అవసరం: ప్రొఫెసర్ లింబాద్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పర్యావరణ సమస్యలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పేర్కొన్నారు. పరిశోధనల ద్వారా పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు చూపడం, నగరాలని మరింత ఆవాసయోగ్యంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. గురువారం క్లైమేట్ ఫైనాన్స్ అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ – ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఉన్నత విద్యలో సంస్కరణలతో పాటు పరిశ్రమల అంచనాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను మారుస్తున్న క్రమాన్ని వివరించారు. సెమిస్టర్ విధానం, సీబీసీఎస్, దోస్త్ సహా ఉన్నత విద్యామండలి చేపడుతున్న కార్యచరణను విపులీకరించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, విద్యాభివృద్ధి కోసం ఈపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ వాణీ ప్రసాద్ చేస్తున్న కృషిని గుర్తు చేశారు.

వాతావరణ, పర్యావరణ అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న ఓయూ అధికారులను అభినందించారు. అనంతరం వాణీ ప్రసాద్ మాట్లాడుతూ వాతావరణ మార్పు వంటి సమకాలీన సమస్యలపై సదస్సు నిర్వహించడం పట్ల ఓయూ కామర్స్, వాణిజ్య నిర్వహణ విభాగం కృషిని అభినందించారు. వాతావరణ, పర్యావరణ మార్పులు, సమస్యలు, పరిష్కారాలపై నాణ్యమైన పరిశోధనలు జరగాలని ఇందుకు విశ్వవిద్యాలయాలు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే కార్బన్ ఉద్ఘారాలకు పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. పర్యావరణానికి నష్టం కలిగించే విషయమై అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం మానుకుని పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు. యుద్ధాల నుండి సుస్థిరత, అభివృద్ధి, దిశగా పయనించాలని వివరించారు. వాతావరణ న్యాయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వాతావరణ, పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపే పరిశోధనల కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రపంచ సంస్థలతో పాటు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. వాణిజ్యంతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానం ద్వారా బయోడైవర్సిటీ సోర్సెస్‌లో పరిశోధన అవసరమని చెప్పారు.

అంతర్జాతీయ సదస్సు ఛైర్మన్, ఓయూ కామర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ చెన్నప్ప స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ కామర్స్ డీన్ ప్రొఫెసర్ ఎం. గంగాధర్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ వి. అప్పారావు, ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, ఓయూ క్యాంపస్, అనుబంధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పలువురు పరిశోధక పత్రాలు సమర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News