వైద్య నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయ తాండవం సాగిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ మూడో బూస్టర్ డోస్ అవసరమౌతుందా ? అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మూడో డోసు కరోనాను అరికట్టడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించే డేటా అవసరమని, కానీ ఇప్పుడు అంతా ఊహాజనితం గానే ఉంటోందని వైద్య ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడోసారి టీకా తీసుకుంటే కరోనాను సమర్ధంగా నిరోధించ వచ్చన్న అంశంపై సమగ్రంగా అధ్యయనం జరపాల్సి ఉందని చెబుతున్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్న వారికి ఈ ఏడాదిలో మరో బూస్టర్ అవసరమని ఆయా కంపెనీలు ఇటీవల ప్రకటించాయి. ఇకనుంచి ఏడాదికి ఒక డోసు అవసరమని చెబుతున్నాయి. ఈనెల మొదట్లో భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో డోసును కొంతమంది వాలంటీర్లకు ట్రయల్స్‌లో ఇవ్వడానికి అనుమతించింది. ప్రస్తుతం కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల రెండు డోసులను ఎనిమిది వారాల వ్యవధిలో ఇస్తున్నారు. ఆరు నెలల తరువాత మరో బూస్టర్ డోస్ అవసరమని భారత్ బయోటెక్ ప్రతిపాదించింది.
అయితే కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మూడో డోసు కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందనే దానిపై అధ్యయనం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ 2019లో కరోనా మనదేశంలో ప్రారంభమైంది. 2020 ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్య టీకా తయారీ ప్రారంభమైంది. అందువల్ల మూడో డోసు అవసరమని చెప్పడానికి మన దగ్గర సరైన గణాంకాలు లేవు. ఇది నిర్ణయించడానికి రెండు డోసుల తరువాత శరీరంలో యాంటీబాడీల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. ఇదేమీ లేకుండా జౌషధ సంస్థలు మూడో డోసు తీసుకోవాలని ప్రతిపాదించడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఐసిఎంఆర్ నేషనల్ ఎయిడ్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సమిరన్ పండా అభిప్రాయ పడ్డారు.