Sunday, January 19, 2025

తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం అవసరం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు
ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ
ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారం
విభజన కంటే వైసీపీ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ
ఏపీ, తెలంగాణ అభివృద్ధే టీడీపీ ధ్యేయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన.

తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంతవరకు టిడిపి జెండా రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినపుడు టీడీపీ శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డానన్నారు. నాలెడ్జి ఎకానమీకి టీడీపీ హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, భారాస అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ఆయనకు మరోసారి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరముంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. ఏపీ, తెలంగాణ అభివృద్ధే టీడీపీ ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం. 2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చింది. విభజన కంటే వైసీపీ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు.

మళ్ళీ సుపరిపాలన చూస్తారు..

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్ తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1995లో పరిపాలనను మళ్ళీ చూపిస్తానని,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు. విభజన వలన కంటే జగన్ పాలనతో ఏపీ ఎక్కువ నష్టపోయిందని, ఏపీలో కూటమి రాకపోయి ఉంటే తెలంగాణకు ఆంధ్రకు వంద శాతం తేడా ఉండేదన్నారు. తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామని, తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చంద్రబాబు అన్నారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒకస్థాయికి వచ్చేసిందని, తలసారి ఆదాయంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందుందన్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్ళటానికి ఇక్కడ నాయకులకు అవకాశముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బందుల నుంచి గట్టెకించే బాధ్యత తనదన్నారు. పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకుందామని, రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు తనకు తెలుసునని చంద్రబాబు అన్నారు. విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వారిదేనని, అభివృద్ధి కోసం ఐక్యమత్యంతో పని చేద్దామని సూచించారు. జై తెలంగాణ నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ముగించారు.

కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు…

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చేరుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు. తర్వాత తెలంగాణ నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీటీడీపీ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై చర్చలు జరిపారు. అనంతరం కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News