న్యూఢిల్లీ : రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తాగునీటి కుండను తాకాడన్న కారణంగా 9 ఏళ్ల దళిత విద్యార్థిని అక్కడి ఉపాధ్యాయుడు చితక బాదడం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఇటువంటి కులవ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ మాజీ సీకర్, సీనియర్ కాంగ్రెస్ నేత మీరా కుమార్ ఆదివారం స్పష్టం చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె కులం పేరుతో జరుగుతోన్న ఇటువంటి దాడులను ఏదో ఒక ప్రభుత్వానికో, పార్టీకో ఆపాదించవద్దని, అలా చేస్తే కుల వ్యవస్థ నిర్మూలను అంశం పక్కదారి పడుతుందని అభిప్రాయపడ్డారు.
దళితులపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానంలో ఏమైనా లోపం కనిపిస్తుందా అన్న ప్రశ్నకు మీరా కుమార్ బదులిస్తూ ఈ విషయంలో ఎవ్వరినీ ఆరోపించడం లేదని, అలాగని ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీనికి రాజకీయాలు కూడా కొంతవరకు కారణమే అయినప్పటికీ, ఇదొక సామాజిక సమస్య అని , ఇటువంటి విషయాల్లో రాజకీయ కోణాలను మాట్లాడటం వల్ల సమస్య పక్కదారి పడుతుందన్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన ఈ దురాచారాన్ని నిర్మూలించేందుకు సమాజం , ముఖ్యంగా యువత ముందుకు రావాలన్నారు. కులం, మతం, శరీరం రంగు, ఆర్థిక నేపథ్యం తదితర పక్షపాత దృష్టి అన్నది పూర్తిగా లేకుండా చూడాలన్నారు.