ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భ్యార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ, మునులూ పరమేశ్వరునికి తెలుపగా, అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి, మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బతికించాడు. అంత దేవాదులు ’పార్వతీ నీ శాపం వల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. నీ శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్ధించారు. ’వినాయక చవితినాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితినాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో … నాకు ఎలాంటి అపనింద రానున్నదో’ అని అనుకున్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యునివరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్ధమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకి ఇవ్వవలసిందని దానితో రాజ్యాభివృద్ధి జరుగుతుందని అడిగాడు,దానికి సత్రాజిత్తు ఇంత మహిమ కలిగిన శమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దానిని మాంసపు ఖండమని భావించి ప్రసేనుడిని సంహరించి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు. మణికోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని సంహరించాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు.
అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రున్ని చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్ళగా అక్కడ ఒకచోట ప్రసేనుని కళేబరం సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి. ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తనవారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే. గుహ లోపలికి వెళ్లి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూశాడు దాన్ని తీసుకుని వెనుతిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలు పెట్టింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవై ఎనిమిది రోజుల పాటు నిరవధికంగా యుద్దం జరిగింది. బండరాళ్ళతో, వృక్షాలతో, ముష్టి ఘాతాలతో ఇరువురూ ఒకరిని ఒకరు గాయపరుచుకుంటున్నారు. జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వయుద్దం చేయాలని కోరుకున్నాను.
అప్పట్నుంచీ మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది’ అంటూ ప్రార్ధించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితోపాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియజేశాడు. శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి, మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు.
శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతీ,సత్యభామలను భార్యలుగా పొందాడు. దేవాదులు, మునులు కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనింద బాపుకున్నారు, మా పరిస్థితి ఏమిటి? అని అడగగా అంతట శ్రీ కృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థినాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసినవాళ్ళు గణపతిని పూజించి,ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని తెలియజేశాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దినాడు దేవతలూ, మహర్షులూ, మానవులూ తమతమ శక్తికొలదీ గణపతిని పూజించి అభీష్టసిద్ది పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు.