Sunday, December 22, 2024

అదరగొట్టిన నీరజ్ చోప్రా.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత సంచలనం

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. టోక్యోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ పారిస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. ఇక మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో తొలి ప్రయత్నంలోనే ఈటను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

క్వాలిఫికేషన్ (గ్రూప్‌బి)లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్‌తో పాటు గ్రెనెడాకు చెందిన పీటర్ అండర్సన్ (88.63మీ) రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ నదీమ్ అర్షద్ (86.59 మీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నదీమ్ కూడా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. బ్రెజిల్ అథ్లెట్ సిల్లా లూయిస్ మూడో ప్రయత్నంలో ఈటెనె 85.91 మీటర్ల దూరంలో విసిరి నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మల్దోవాకు చెందిన ఆండ్రియన్ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

ఫైనల్‌కు చేరాలంటే జావెలిన్‌ను కనీసం 84 మీటర్ల దూరం విసరాలు. ఫైనల్ పోటీలు ఆగస్టు 8న రాత్రి 11.15లకు ప్రారంభమవుతాయి. కాగా క్వాలిఫికేషన్‌లో భారత్‌కు చెందిన మరో అథ్లెట్ కిశోర్ జెనా నిరాశ పరిచాడు. గ్రూప్‌ఎలో పోటీ పడిన కిశోర్ జెనా ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాడు. తొలి ప్రయత్నంలో 80.73 మీటర్ల దూరంలో ఈటెను విసిరిన కిశార్ రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 80.21 మీటర్లు మాత్రమే విసిరి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. ఇదిలావుంటే నీరజ్ చోప్రా మాత్రం అంచనాలకు తగినట్టు రాణిస్తూ తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు.

ఈసారి కూడా అతను స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ జావెలిన్ త్రోయర్‌గా నీరజ్ కొనసాగుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. పారిస్‌లోనూ పసిడి గెలవాలనే లక్షంతో ఉన్నాడు. ఇందులో తొలి అడ్డంకిని ఇప్పటికే అధిగమించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. గురువారం జరిగే ఫైనల్ పోటీల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే నీరజ్ ఖాతాలో మరో స్వర్ణం చేరడం ఖాయం. ఇక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు నీరజ్ పసిడి సాధించాలని కోరుకుంటున్నారు. అతను కూడా అభిమానుల కలను సాకారం చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News