నేడు జావెలిన్ త్రో ఫైనల్ పోరు
టోక్యో: కోట్లాది మంది ఎంతో ఆసక్తికర పోరుకు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సమరోత్సాహంతో సిద్ధమయ్యాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ పోరు శనివారం జరుగనుంది. ఈ పోటీల్లో భారత ఆటగాడు చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. అర్హత పోటీల్లో అసాధారణ ప్రతిభను కనబరిచిన చోప్రా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం సాధించి పెడుతాడని భావిస్తున్న క్రీడాకారుల్లో నీరజ్ ఒకడు. దీంతో అతనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు పేలవమైన ప్రదర్శనే చేశారు. తజిందర్ పాల్ సింగ్, శివ్‌పాల్, కమల్‌ప్రీత్ కౌర్, ద్యుతీచంద్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఒక్క పతకం కూడా లభించలేదు. కానీ నీరజ్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరడంతో పతకం ఆశలు మళ్లీ చిగురించాయి. అర్హత పోటీల్లో చేసిన ప్రతిభను పునరావృతం చేస్తే నీరజ్ ఖాతాలో ఒలింపిక్ పతకం చేరడం ఖాయం. ఇక నీరజ్ మురిపిస్తాడా సహచర అథ్లెట్లలాగా నిరాశ పరుస్తాడా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.