Friday, November 22, 2024

పతకాల వీరుడు..

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra to get Rs 6 crore from Haryana govt

 

హైదరాబాద్ : నీరజ్ చోప్రా కెరీర్ ఆరంభం నుంచే అసాధారణ ప్రతిభతో పతకాల పంట పండిస్తున్నాడు. 2016 ప్రపంచ అండర్20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది జరిగిన దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 2017లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని ముద్దాడాడు. దీంతో 2018లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పసిడి పతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో కూడా జావెలిన్ త్రో క్రీడాంశాల్లో పసిడి పతకం గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. ఇక జావెలిన్ త్రో విభాగంలో జాతీయ రికార్డు కూడా నీరజ్ పేరిటే ఉంది. అంతేగాక జూనియర్ విభాగంలో కూడా నీరజ్ రికార్డు చెక్కుచెదరకుండా నిలిచింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన పేరిట లఖించుకున్నాడు. ఒలింపిక్ అర్హత పోటీల్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో 88.07 మీటర్ల దూరాన్ని విసిరి టోక్యో బెర్త్‌ను దక్కించుకున్నాడు.

కనక వర్షం కురిస్తోంది..

టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నయువ సంచలనం నీరజ్ చోప్రాపై కనక వర్షం కురుస్తోంది. నీరజ్ సొంత రాష్ట్రం హర్యానా ప్రభుత్వం స్వర్ణ వీరుడికి కళ్లు చెదిరే భారీ నజరానాను ప్రకటించింది. నీరజ్ ప్రతిభకు గుర్తింపుగా ఆరు కోట్ల రూపాయల నగదు బహుమతిని అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక యాభై శాతం రాయితీతో ఇంటి స్థలాన్ని మంజూరు చేసేందుకు అంగీకరించింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా నీరజ్‌కు రెండు కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. భారత క్రికెట్ బోర్డు కూడా నీరజ్‌కు కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

నీరజ్ ప్రస్థానం ఇది..

నీరజ్ చోప్రా హర్యానాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామం నుంచి వచ్చాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లు. చిన్నతనంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడు. దీంతో 12 ఏళ్లకు 90 కిలోల బరువు పెరిగాడు. దీంతో కుటుంబ సభ్యులు బరువును తగ్గించాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయితే వారి విజ్ఞప్తులను నీరజ్ పెద్దగా పట్టించుకునే వాడు కాదు. ఫిట్‌నెస్ గురించి పెద్దగా ఆలోచించే వాడే కాదు.

అదే మలుపు తిప్పింది..

అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరగడంతో నీరజ్ స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్‌కు వెళ్లక తప్పలేదు. అక్కడే అతనికి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌదరీతో పరిచయం ఏర్పడింది. ఒక సందర్భంలో చౌదరి జావెలిన్ త్రోను నీరజ్‌కు ఇచ్చి విసరమని చెప్పాదు. చౌదరి ఊహించని విధంగా నీరజ్ ఈటెను చాలా దూరంగా విసిరాడు. దీంతో అప్పుడే అతని ప్రతిభను చౌదరి గుర్తించాడు. అప్పటి నుంచి జావెలిన్ త్రోను క్రీడాంశంగా మలచుకోవాలని చౌదరి ప్రోత్సహించాడు. ఇక అప్పటి నుంచి నీరజ్ కూడా జావెలిన్ క్రీడను సర్వస్వంగా భావించాడు. దీని కోసం నడుం బిగించాడు. బరువును కూడా భారీగా తగ్గించుకున్నాడు. ఆ తర్వాత భారత్ గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదిగి ప్రపంచ క్రీడల్లో ఎదురులేని శక్తిగా మారాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News